Physical Hearing: దిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో తిరిగి భౌతిక విచారణ ప్రారంభించాలని కోరింది సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ). ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కేసుల విచారణలు చేపట్టాలని సూచించింది.
దేశంలోనూ గత రెండు వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని లేఖలో ప్రస్తావించారు ఎస్సీబీఐ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్. కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనూ అందులో ఉదహరించారు.
దిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు ఫిబ్రవరి 7న తిరిగి ప్రారంభించుకోవచ్చని అక్కడి ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అన్ని కార్యాలయాల్లోనూ 100 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానంలోనూ ఫిజికల్ మోడ్‌లో విచారణలు కొనసాగించాలని బార్ అసోసియేషన్ కోరింది.
Omicron India: కరోనా మూడో దశలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో.. భౌతిక విచారణలకు దూరంగా ఉంది అపెక్స్ కోర్టు. 2022 జనవరి 3 నుంచి వర్చువల్‌గానే కేసుల విచారణ జరుగుతోంది. ఆ తర్వాత.. న్యాయమూర్తులు తమ రెసిడెన్షియల్ కార్యాలయాల నుంచే కేసుల వాదనలు విన్నారు.
ఇవీ చూడండి: 'తండ్రి ఆస్తుల్లో.. వారి కంటే కుమార్తెలకే ప్రాధాన్యం'