కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ను నియమించే విషయమై మే 2 లోపు అత్యున్నతస్థాయి సంఘం సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ సంస్థను ఇన్‌ఛార్జి డైరెక్టరుతో నడిపించలేరని వ్యాఖ్యానించింది.
సీబీఐకి పూర్తికాల డైరెక్టర్‌ను నియమించకపోవడంపై 'కామన్ కాజ్' అనే సంస్థ దావా వేసింది. దీనిని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
మే 2 తర్వాతే..
ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జితో కూడిన అత్యున్నతస్థాయి సంఘం సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేస్తుంది. మే 2 తర్వాత ఈ కమిటీ సమావేశమవుతుందని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.
ఉద్దేశ్వపూర్వకంగానే..
జస్టిస్ ఎస్.ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారని, ఆయన ఉండగా భేటీ జరగకూడదన్న ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు.
ఈ కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మావోయిస్టులపై పోరులో జవాన్లకు అండగా ఉంటాం: షా