1994 ఇస్రో గూఢచర్యం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించింది సుప్రీంకోర్టు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై పోలీసులు కుట్ర పన్నారన్న అభియోగాలపై సర్వోన్నత న్యాయస్థానానికి ముగ్గురు సభ్యుల అత్యున్నత కమిటీ నివేదిక సమర్పించింది. ఈ కమిటీకి జస్టిస్ డీకే జైన్ నేతృత్వం వహించారు.
కమిటీ నివేదికను సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఈ నివేదికలోని వివరాలను ప్రాథమిక దర్యాప్తు ఫలితాలుగా పరిగణించాలని పేర్కొంది. వాటి ఆధారంగా చర్యలు తీసుకునే అధికారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ కమిటీ నివేదికను బహిర్గతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణకు సంబంధించి 3 నెలల్లో నివేదిక అందించాలని సీబీఐని ఆదేశించింది.
ఇస్రోలో విశేష సేవలందించిన నంబి నారాయణన్.. 1994లో దేశద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇస్రో మిషన్లకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను విదేశాలకు చేరవేశారన్న అభియోగాలు ఆయనపై వచ్చాయి. కేసులు, కోర్టు విచారణల అనంతరం ఆయన నిర్దోషిగా తేలారు. నంబి నారాయణన్‌ను ఈ కేసులో ఇరికించడం వెనక కొందరు పోలీసుల హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ప్రధాని మోదీని కలిసిన నంబీ నారాయణ్, మాధవన్