ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం చెల్లుతుందో, లేదో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అదే సమయంలో ఈ 'లవ్ జిహాద్' చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
'సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' ఎన్జీఓ, న్యాయవాది విశాల్ ఠాక్రేతో పాటు పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. సంబంధిత వ్యాజ్యాలపై ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల వాదనలు వినకుండా చట్టంలోని నిబంధనలపై స్టే విధించలేమని పిటిషనర్లకు తెలిపింది.
ఇదీ చూడండి:- రైతు నిరసనలపై ఈనెల 11న సుప్రీం విచారణ
సుప్రీం తీవ్ర అసంతృప్తి..
వర్చువల్ కోర్టు వ్యవస్థ తమ అవసరాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విధానంలో కోర్టు కార్యకలాపాలు సాగించడం చాలా కష్టంగా మారిందని పేర్కొంది. పక్కనే ఉన్న దిల్లీ కోర్టులో అనుసరిస్తున్న వర్చువల్ కోర్టు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు కలగడం లేదని.. మరి సర్వోన్నత న్యాయస్థానంలో ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. ఈ విషయంపై చర్యలు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థాన ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
కరోనా సంక్షోభం కారణంగా 2020 మార్చి నుంచి విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపడుతోంది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండి:- సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టు అనుమతి