కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో అన్నదాలు చేస్తున్న ఆందోళనలను సుప్రీంకోర్టు సమర్థించింది. శాంతియుత నిరసనలు చేపట్టడం రైతుల హక్కు అని పేర్కొంది. అదే సమయంలో ఆందోళనల కారణంగా ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడం సరికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చర్చలు జరపకుండా, నిరవధిక ఆందోళనలు చేయడం సారికాదని రైతు సంఘాలకు సూచించింది. రైతుల నిరసన కారణంగా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులు, అధికారులదే అని పేర్కొంది.
దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం. వివాదం పరిష్కారం అయ్యేవరకు నూతన సాగు చట్టాల అమలును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు, రైతు సంఘాల నాయకులతో నిష్పాక్షిక, స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది. కేంద్రం, రైతు సంఘాలు మధ్య ప్రస్తుతం చర్చలు జరగకపోవడం బాధాకరమని తెలిపింది. ప్యానెల్ ఏర్పాటుపై అందరి వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామంది.
అలా అయితే చర్చలకు రారు..
మూడు నూతన సాగు చట్టాల అమలును నిలిపివేయాలనే సుప్రీం సూచనపై కేంద్రం తరఫు న్యాయవాది కేకే వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చేస్తే కేంద్రంతో రైతులు చర్చలు జరపడానికి అసలు ముందుకురారని కోర్టుకు తెలిపారు.
చట్టాల అమలును ఆపాలని తాము ఆదేశించట్లేదని, రైతులతో చర్చలు పూర్తయ్యేవరకే తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రానికి సూచిస్తున్నామని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. తాము కూడా భారతీయులమేనని, ప్రస్తుత పరిణామాలు బాధాకరమని పేర్కొంది. ఆందోళనలు చేస్తున్న రైతులు అల్లరి మూకల కాదని చెప్పింది. నిరసనలు చేపట్టిన రైతు సంఘాలకు నోటీసులు అందజేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని, అలాగే వారు శీతాకాల సెలవు దినాల్లోనూ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు స్వేఛ్చ ఇస్తామని పేర్కొంది.
1988లా జరిగితే?
దేశరాజధానిలో 1988లో రైతులు చేపట్టిన బోట్ క్లబ్ ఆందోళనలను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అప్పట్లో దిల్లీ నగరం మొత్తాన్ని రైతులు దిగ్భంధించారని పేర్కొంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు తలెత్తదని, ఆందోళనలు హింసాత్మకంగా మారవని ఎవరు భరోసా ఇవ్వగలరని ప్రశ్నించింది.