యజమానుల ఇళ్లల్లో ఏదైనా వేడుక జరిగితే తమ పనోళ్లు లేదా ఉద్యోగులకు ఖరీదైన దుస్తులు కొంటారు. చిన్న కానుకలు ఇస్తారు. అయితే కర్ణాటక కొప్పల్‌లోని మహావీర్ సామిల్ యజమాని శాంతరాజ్ గోగి తన కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా.. మిల్లో పని చేస్తున్న కార్మికులు ఒక్కొక్కరికి 15 గ్రాముల బంగారు ఉంగరాన్ని కానుకగా ఇచ్చారు.
జనవరి 6న గోగి కుమారుడి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాతికేళ్లుగా తన మిల్లోనే పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నాలుగు జంటలకు ఈ నెల 4న పసిడి రింగులను కానుకగా ఇచ్చారు గోగి.
"మా కార్మికులు నా కుటుంబంలో భాగం. వారి వల్లే నేను ఏడాదిలో లక్షల ఆదాయాన్ని పొందుతున్నాను. వారు లేకుండా నేను లేను. లాక్డౌన్ సమయంలోనూ వారి కష్టసుఖాలను నాతో పంచుకున్నారు. ఈ శ్రామికులు వెలకట్టలేని ఆస్తి. ఈ కారణంగానే నేను వారిని నా సొంత కుటుంబ సభ్యులుగా, మాలో ఒకరుగా భావిస్తాను. అందుకే వారికి ఈ విధంగా గౌరవించాను."
- శాంతరాజ్ గోగి, మహావీర్ సామిల్ యజమాని
పాతికేళ్లుగా ఎంతో నమ్మకంగా తన వద్దే పని చేస్తున్న వారి బాగోగులను గోగి చూసుకుంటున్నట్లు శ్రామికులు చెప్పారు.
ఇదీ చూడండి: బాలీవుడ్ సినిమాను తలపించేలా.. స్ట్రెచర్‌పైనే ఆ పెళ్లి!