Satya Pal malik on Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల మరణాలపై అనుచితంగా మాట్లాడారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. మోదీ అహంకారంతో ప్రవర్తించారని గవర్నర్ పేర్కొనడం.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు.. అధికార పక్షంపై మండిపడుతున్నాయి.
అసలేమైందంటే..?
Satya Pal Malik speech: హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ మాలిక్.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనల విషయంపై ఓ సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని అన్నారు. తాను మోదీతో వాగ్వాదానికి దిగినట్లు చెప్పుకొచ్చారు.
మాలిక్ మాటల్లో....
Modi arrogant Satya Pal malik video
"రైతుల సమస్యలపై చర్చించినప్పుడు ఐదు నిమిషాల పాటు ప్రధానితో వాగ్వాదం జరిగింది. కుక్క చనిపోయినా మీరు సంఘీభావం ప్రకటిస్తారు.. అలాంటిది 500 మంది రైతులు మరణించారని నేను ప్రశ్నించినప్పుడు.. మోదీ చాలా అహంకారంతో స్పందించారు. 'నా కోసం చనిపోయారా?' అని అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయారని నేను చెప్పాను. అయితే, ఆయనతో ఘర్షణ కోరుకోలేదు. అమిత్ షాను కలిసి మాట్లాడాలని ఆయన(మోదీ) చెప్పారు. నేను అమిత్ షాను కలిస్తే.. కొందరు ఆయన్ను ఇలా మార్చారు, తరచూ కలుస్తూ ఉండాలని సూచించారు."
-సత్యపాల్ మాలిక్, మేఘాలయ గవర్నర్
అవి మోదీ లక్షణాలు: కాంగ్రెస్
Congress on Satya Pal Malik remark: మోదీకి ఉన్న అహంకారం, క్రూరత్వానికి మాలిక్ వ్యాఖ్యలు నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. మోదీ లక్షణాలు, వ్యక్తిత్వం మాలిక్ వ్యాఖ్యల్లో స్పష్టమయ్యాయని చెప్పుకొచ్చింది. ఇది దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. మోదీ అహంకారం వల్లే 700 మందికి పైగా రైతులు మరణించారని ధ్వజమెత్తింది. ప్రతికూల పరిస్థితుల్లో ఏడాది పాటు రైతులు ఉద్యమించారని గుర్తు చేసింది.
మోదీజీ.. నిజమేనా?: ఖర్గే
Kharge on Malik Modi arrogant speech: మాలిక్ వీడియోను షేర్ చేస్తూ తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా అని ప్రశ్నించారు. 'అమిత్ షా.. మోదీని 'పిచ్చివాడు' అని పేర్కొన్నట్లు మాలిక్ చెబుతున్నారు. రైతుల సమస్యలపై ప్రధాని అహంకారంతో వ్యవహరించారని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు ఇలా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీజీ ఇది నిజమేనా?' అని ట్వీట్ చేశారు.
ఒవైసీ ఎద్దేవా!
మోదీకి కేవలం ప్రశంసలే కావాలని.. నిజాలు వినాలని అనుకోరని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. 'రైతుల మరణాల గురించి గవర్నర్ మాలిక్ మాట్లాడితే మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నుంచే నిజాలు వినడానికి మోదీ ఇష్టపడటం లేదని మాలిక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రజల నుంచి ఏం వింటారు? మోదీకి కేవలం ప్రశంసలే కావాలి' అని ఎద్దేవా చేశారు.
మాలిక్ భాజపా మనిషే: ఒమర్
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ వ్యవహారంపై స్పందించారు. తనను పెంచిన చేతిని మాలిక్ కరుస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ ప్రజలకు మాలిక్ 'అవిశ్వసనీయత' గురించి తెలుసు అని అన్నారు. 'ఈ వ్యక్తి వారి(భాజపా) మనిషే. జమ్ముకశ్మీర్లో వివాదాలు సృష్టించేందుకు ఈయన్ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు తనను పెంచిన చెయ్యినే కాటేశారు' అని అన్నారు.
గవర్నర్‌గా బదిలీలు..
గవర్నర్‌గా మాలిక్ వ్యవహార శైలి ఇప్పటి వరకు భిన్నంగా నడుస్తూ వచ్చింది. ఆయన ఈ పదవి చేపట్టినప్పటి నుంచి నాలుగు రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 2017లో ఆయన్ను బిహార్ గవర్నర్‌గా నియమించే నాటికి భాజపా కిసాన్ మోర్చా ఇన్-ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అప్పటికే భాజపా-జేడీయూ సర్కారుపై బిహార్‌లోని అనాథాశ్రమాల్లో సెక్స్ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వార్తా కథనాలపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన బిహార్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆయన్ను 2018 ఆగస్టులో కశ్మీర్ గవర్నర్‌గా బదిలీ చేశారు. జమ్ము కశ్మీర్ విభజనకు విభజన తర్వాత మేఘాలయకు గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఇదీ చదవండి: 'ఆపరేషన్ కైలాస్ రేంజ్'ఎఫెక్ట్.. ఆ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం