తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ(V K Sasikala) రాజకీయ రీఎంట్రీని తోసిపుచ్చింది అన్నాడీఎంకే(AIADMK). అలాంటి వాదనలు పార్టీ మద్దతుదారుల్లో గందరగోళం సృష్టించేవిగా పేర్కొంది. ప్రస్తుతం శశికళ పార్టీతో లేరని, ఒకవేళ తిరిగి రావాలనుకున్నా.. పార్టీలోకి తీసుకోమని స్పష్టం చేసింది. క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నట్లు శశికళ సూత్రప్రాయంగా తెలిపిన మరుసటి రోజునే ఈ విధంగా స్పందించింది అన్నాడీఎంకే.
ఈ నేపథ్యంలో పార్టీకి శశికళ దూరంగా ఉండాలని సూచించారు ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి. ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించకూడదనే అంశంపై కేడర్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు.
"శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకేతో లేరు. పార్టీలో ఎవరితోనూ సంబంధాలు లేవు. పార్టీలో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు. శశికళ రీఎంట్రీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను, కార్యకర్తలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నాలు ఫలిచవు. పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త వారి ట్రాప్‌లో పడరు. పార్టీ నుంచి శశికళతో ఎవరూ మాట్లడలేదు. పార్టీకి ఆమె దూరంగా ఉండాలి."
- మునుస్వామి, అన్నాడీఎంకే సీనియర్ నేత.
పార్టీకి శశికళ దూరంగా అండాలనే.. దివంగత నేత జయలలిత ఆత్మ కోరుకుంటుందన్నారు మునుస్వామి. తనతో పాటు కార్యకర్తల నిరంతర కృషి వల్లే పార్టీ నిర్మితమైందన్న శశికళ వ్యాఖ్యలను ఖండించారు. ఎంజీ రామచంద్రన్ పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి అసంఖ్యాక కార్యకర్తలు బలోపేతం చేశారు కానీ, శశికళ కాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి శశికళ!