అన్నాడీఎంకే(AIADMK) బహిష్కృత నేత, జయలలిత నెచ్చెలి వీకే శశికళ(Sasikala) మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టాక క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ నేతలతో శశికళ మాట్లాడిన ఆడియో క్లిప్(Sasikala audio clip) ఈ విషయానికి మరింత బలం చేకూర్చుతోంది.
'కంగారు పడకండి. పార్టీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. అందరూ ధైర్యంగా ఉండండి. కరోనా మహమ్మారి ముగిసిపోతే నేను వచ్చేస్తా' అని పార్టీ కార్యకర్తలతో శశికళ మాట్లాడారు. 'మేమంతా మీ వెంటే ఉన్నాం అమ్మ' అంటూ పార్టీ కార్యకర్తలు ఇందుకు బదులిచ్చారు. ఈ ఫోన్‌కాల్‌ను అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్(TTV Dinakaran) వ్యక్తిగత సహాయకుడు జనార్థనన్ ధ్రువీకరించారు.
జైలు నుంచి విడుదలైన శశికళ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మార్చిలో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో జయలలిత పాలన కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి- మళ్లీ రాజకీయాల్లోకి చిన్నమ్మ- అన్నాడీఎంకేపైనే గురి!