తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ప్రభావానికి ఏఐఏడీఎంకే కార్యకర్తలు లోను కాకుండా ఉండేందుకు ఆ పార్టీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని పురస్కరించుకుని ఇళ్లల్లో దీపాలు వెలిగించి, పార్టీ సంరక్షణకు కట్టుబడి ఉంటామని అమ్మ పేరు మీద ప్రతిజ్ఞ చేయాలని కార్యకర్తలను కోరింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యకర్తలకు సీనియర్ నేతలు తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం లేఖలు రాశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. శత్రువులు, ద్రోహులు చేతులు కలిపారని లేఖలో కె.పళనిస్వామి, పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. రెండో సారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక శక్తులకు గుణపాఠం నేర్పాలని అన్నారు. ఆకర్షణలు, ఆరోపణలు చేయడం ద్వారా.. పార్టీ పట్ల విధేయతను కొనుగోలు చేయలేరని తెలిపారు. 'అమ్మ' పేరు మీద ఫిబ్రవరి 24న సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు చేయాలని సూచించారు. పార్టీకీ 'అమ్మ' ఆత్మ అండగా నిలుస్తుందని చెప్పారు.
ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరులో నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే తమిళనాడుకు చేరుకున్నారు.
ఇదీ చదవండి:అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు