Sanskrit Talking Village : కర్ణాటకలోని బెలగాం జిల్లాలోని నందీశ్వర్ అనే చిన్న గ్రామం సంస్కృతం మాట్లాడంలో చరిత్ర సృష్టించింది. ఈ గ్రామానికి చెందిన దండేశ్వర మహాస్వామి చొరవతో గ్రామస్థులందరూ సంస్కృత భాషలోనే మాట్లాడుతున్నారు. ఆయన 2015లో నందీశ్వర్‌లో సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామంలోని అందరికీ సంస్కృతం నేర్పించారు. దాంతో సంస్కృత భాష గ్రామ ప్రజల దినచర్యలో భాగమైంది. తద్వారా దేశంలోనే సంస్కృతం మాట్లాడే ఏకైక గ్రామంగా నందీశ్వర్ ప్రాంతం రికార్డుల్లోకి ఎక్కింది.
రోజుకు 5 నుంచి 8 గంటలు..
నందీశ్వర్ గ్రామంలోని సంస్కృత పాఠశాలలో ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల పూర్తిగా సంస్కృత మీడియం. విద్యార్థులు రోజూ 5నుంచి 8గంటల వరకు సంస్కృత భాషను సాధన చేస్తున్నారని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఫలితంగా విద్యార్థులు చాలా సులభంగా సంస్కృత శ్లోకాలు చదువుతున్నారని వివరించారు. వారికి పాఠాలు చెప్పటానికి వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు కూడా సంస్కృతం నేర్చుకోవడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నట్లు పాఠశాల సిబ్బంది వెల్లడించారు.
పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా..
ఈ పాఠశాలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు. అంతేకాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఉద్యోగులు సంస్కృత భాషను నేర్చుకునేందుకు సెలవు దినాల్లో ఇక్కడికి వస్తుంటారు. సంస్కృతాన్ని నేర్చుకోవడమంటే భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృతాన్ని నేర్చుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.
'కష్టాలు తొలగుతాయి..'
భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, సంస్కృత భాషను భావి తరాలకు అందిచడం కోసమే ఈ ప్రయత్నం మొదలు పెట్టామని దండేశ్వర మహాస్వామి అన్నారు. పాఠశాలలో రోజూ ఉచిత సంస్కృత తరగతులు జరుగుతుంటాయని.. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా హాజరు కావచ్చని తెలిపారు. సంస్కృత వేద మంత్రాలకు, శ్లోకాలకు ప్రత్యేక శక్తి ఉందని.. వాటిని చదవడం వల్ల కష్టాలు తొలగిపోతాయని వివరించారు.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు - ఏడుగురు మృతి, మరో 24మందికి గాయాలు
ప్రియుడి ఫోన్లో 13వేల న్యూడ్ ఫొటోలు- ప్రియురాలు కంప్లైంట్, నిందితుడు అరెస్ట్