Sankranti Cock Fight 2024 : ఏపీలో నిబంధనలతో సంబంధం లేదు! మాకు నచ్చినట్లు చేసుకుంటాం! అధికార పార్టీ నేతల అండదండలున్నాయ్! అంతా మా ఇష్టం అన్నట్లుగా కోడిపందేల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పందేలపై ఏపీ హైకోర్టు అంక్షలున్నా క్షేత్ర స్థాయిలో అవి బుట్టదాఖలవుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో రెండో రోజూ యథేచ్ఛగా కోళ్ల పందేలు సాగాయి. పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన బరుల్లో భారీగా నోట్ల కట్టలు చేతులు మారాయి. గుండాట, జూదం, పొట్టేళ్ల పందేలూ జోరుగా సాగాయి.
AP High Court Rules on Sankranti Kodi Pandalu : స్వాగత ఫ్లెక్సీలు, షామియానాలు, వీఐపీలకు, సాధారణ వ్యక్తులకు వేర్వేరుగా గ్యాలరీలు, ఫ్లడ్‌లైట్ల వెలుగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులు, పందెం రాయుళ్లు ! ఇవీ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు. సంక్రాంతిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు కోడి పందేలు, గుండాట, జూద క్రీడలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు చూస్తే ఔరా అనాల్సిందే. పందేలను నిలువరించాలని హైకోర్టు స్పష్టం చేసినా వాటి అమలులో అధికారులు విఫలం కావడంలో బరుల వద్ద భారీగా నగదు చేతులు మారుతోంది.
సంక్రాంతి వేళ జోరుగా సాగుతున్న పోటీలు - భారీగా తరలివస్తున్న ప్రజలు
బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు : ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అంపాపురం, ఈడుపుగల్లు వద్ద భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కోడి పందేలు, జూదం, గుండాట నిర్వహించారు. బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. కార్యక్రమాల నిర్వహణకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో పోలీసులు మిన్నకుండిపోయారు.
నోరు మెదపని అధికారులు : అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. పందేలను తిలకించేందుకు తరలివచ్చిన వారు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలపడంతో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కృష్ణా నది ఎడమ కరకట్టను తవ్వి బాట ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.
ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
అనధికారికంగా కోడి పందేలు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల జోరు రెండో రోజూ కొనసాగింది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బరులు సిద్ధం చేసి పందేలు నిర్వహించారు. వీటిని వీక్షించేందుకు పక్కరాష్ట్రాల నుంచీ పందెంరాయుళ్లు తరలివచ్చారు. అనధికారికంగా అందరికీ తెలిసే కోడి పందేల తంతు సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తయినా చూడలేదు.
ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కోడి పందేలు : తణుకు, తేతలి, దువ్వ వేల్పూరు తదితర ప్రాంతాల్లో రాత్రి వేళలోనూ ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పందేలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పలుచోట్ల రాత్రి సమయంలోనూ ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కోడి పందేలు, గుండాటలు కొనసాగాయి. కోనసీమ జిల్లాలో కోడి పందేలతో పాటు గుండాటలు జోరుగా నిర్వహించారు.