బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం వెలుగుచూసింది. ఈ కేసు విచారణ నుంచి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేను తొలగించారు. ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణను నుంచి తప్పిస్తూ ఎన్‌సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబయి జోన్ ఆర్యన్ ఖాన్ కేసును విచారిస్తుండగా.. ఇకపై ఎన్‌సీబీ సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఐదు కేసులను సెంట్రల్ యూనిట్‌కు బదలాయించారు. ఈ కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్ సింగ్ విచారించనున్నారు.
ప్రస్తుతం ముంబయి జోనల్ అధికారిగా ఉన్న వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యోగం కోసం డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని, బోగస్ డ్రగ్స్ కేసుల్లో పలువురిని అరెస్ట్ చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కేసు నుంచి వాంఖడేను తప్పించటంపై స్పందించిన నవాబ్ మాలిక్ ఇది ఆరంభం మాత్రమే అని ట్వీట్ చేశారు.
'విచారణ నుంచి తొలగించలేదు..'
మరోవైపు ఈ నిర్ణయంపై స్పందించిన సమీర్ వాంఖడే.. 'నన్ను విచారణ నుంచి తొలగించలేదు. కేంద్ర బృందాలు విచారణ జరిపించాలని నేనే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశా. కాబట్టే ఆర్యన్, సమీర్ ఖాన్ కేసులను దిల్లీ ఎన్‌సీబీ ఆధ్వర్యంలోని సిట్ విచారించనుంది. ఇది దిల్లీ, ముంబయికి చెందిన ఎన్‌సీబీ బృందాల సమన్వయంతోనే జరుగుతోంది' అని అన్నారు.
ఇవీ చదవండి: