Azam Khan News: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు రాంపుర్ కోర్టులో గట్టి షాక్ తగిలింది. 2019లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఓ ఐఏఎస్ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది.
2019లో యూపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా అజంఖాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఐఏఎస్ అధికారి అంజనేయ కుమార్ సింగ్ (అప్పట్లో జిల్లా మెజిస్ట్రేట్)లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో రాంపుర్ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఆజం ఖాన్‌పై నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు ఆజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.