షేవింగ్ విషయంలో గొడవ జరిగి.. కస్టమర్‌ను పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు ఓ సెలూన్ యజమాని. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు.. నిందితుడ్ని కొట్టి చంపేశారు. అతడి దుకాణాన్ని, ఇంటిని తగలబెట్టారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వట్లో గురువారం రాత్రి జరిగిందీ ఘటన.
పని పూర్తి కాకుండానే..
పోలీసుల కథనం ప్రకారం.. బోధి గ్రామంలో అనిల్ మారుతి శిందేకు సెలూన్ షాప్ ఉంది. అదే గ్రామానికి చెందిన వెంకట్ సురేశ్ దేవ్కర్(22) గురువారం రాత్రి షేవింగ్ చేయించుకునేందుకు వెళ్లాడు. సగం గడ్డం తీశాక.. డబ్బులు ఇవ్వమని అడిగాడు అనిల్. పని పూర్తయ్యాక ఇస్తానని చెప్పాడు వెంకట్. అందుకు అనిల్ ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఘర్షణకు దారి తీసింది. దుకాణంలో అందుబాటులో ఉన్న పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు కోశాడు అనిల్.
సెలూన్ షాప్‌లోనే వెంకట్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి బంధువులు.. తీవ్ర ఆగ్రహంతో సెలూన్ షాప్‌పై విరుచుకుపడ్డారు. దుకాణాన్ని తగలబెట్టారు. యజమాని అనిల్‌ను వెతికి పట్టుకుని.. గ్రామంలోని ఓ మార్కెట్లో కొట్టి చంపారు. అనంతరం అతడి ఇంటిని తగలబెట్టారు.
సమాచారం అందిన వెంటనే కిన్వట్ పోలీసులు హుటాహుటిన బోధి గ్రామానికి చేరుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు కిన్వట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అభిమన్యు సోలంకి తెలిపారు.