Saif Kareena son name in Exam: ఆరో తరగతి చదివే పిల్లల ప్రశ్నాపత్రంలో ఏముంటుంది? అశోకుడికి సంబంధించిన ప్రశ్నలో, గ్రహాలు- ఉపగ్రహాల గురించో ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్లోని ఓ పాఠశాలలో మాత్రం సినిమా తారల గురించి అడిగారు. కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్లకు పుట్టిన బిడ్డ పేరు ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Sixth class Question Kareena son
ఈ ప్రశ్నాపత్రం ఖాండవలోని ఓ ప్రైవేటు ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలకు చెందినదిని తెలుస్తోంది. జనరల్ నాలెడ్జ్ టెస్టులో ఈ ప్రశ్నలు అడిగారు. గురువారం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.
ఉపాధ్యాయ సంఘాలతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం, దేశభక్తికి సంబంధించిన ప్రశ్నలు అడగకుండా.. సినిమా గురించి అడగటం ఏంటని నిలదీస్తున్నారు. నటీనటుల పిల్లల పేర్లను గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
"పాఠశాల విద్యలో దేశ చరిత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అలాంటప్పుడు వాటికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి. అంతేకానీ ఇదేంటి? ఇప్పుడు విద్యార్థులు.. నటీనటుల పిల్లల పేర్లనూ గుర్తుంచుకోవాలా? ఈ విషయంలో పాఠశాల యాజమాన్యంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి."
-డాక్టర్ అనీశ్ అర్జారే, టీచర్స్, పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుడు
ఈ విషయంపై స్పందించిన జిల్లా విద్యాధికారి ఎస్కే భాలేరావ్.. ప్రశ్నాపత్రం అంశమై పాఠశాల యాజమాన్యానికి నోటీసులు పంపించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు రూపొందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ తరహా ప్రశ్నలు ఉండకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
నెటిజన్ల సెటైర్లు
మరోవైపు, దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. సైఫ్-కరీనాకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, వారిలో ఎవరి పేరు రాయాలో స్పష్టంగా చెప్పలేదని చలోక్తులు విసురుతున్నారు.
2012లో సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ల వివాహం జరిగింది. వీరిద్దరీకి తైమూర్ అలీఖాన్ పటౌడీ, జహంగీర్ అలీఖాన్ పటౌడీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కరీనా కపూర్