Saffron Cultivation In Kerala : కిలో ధర రూ.3లక్షల రూపాయలు! సుగంధ ద్రవ్యాల రారాజుగా పేరు!! అంతటి ప్రత్యేకమైన కుంకుమ పువ్వు ఇప్పుడు కేరళ ఇడుక్కి జిల్లా కంతళ్లూర్లోనూ పండుతోంది. ఒకప్పుడు ఈ కుంకుమ పువ్వు సాగు కశ్మీర్ లోయకు మాత్రమే పరిమితం. కానీ.. ఎన్నో ప్రయత్నాల తర్వాత కేరళకు వచ్చింది. కశ్మీర్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలు.. ఇడుక్కి జిల్లా సంతన్పరాలోని వ్యవసాయ కేంద్రంలో మొలకెత్తాయి.
"కశ్మీర్, శ్రీనగర్లో మాత్రమే పండే కుంకుమ పువ్వును ఇక్కడ సాగు చేయడానికి కృషి విజ్ఞాన్ కేంద్రం గత రెండేళ్లుగా ప్రయోగాలు చేపట్టింది. ఇప్పుడు ఇది విజయవంతమైంది. ప్రస్తుతం 25 సెంట్ల భూమిలో కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాం." అని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ తెలిపారు.
మొదటి ఏడాది వర్షం కారణంగా పంట దెబ్బతింది. తర్వాత శాస్త్రవేత్తలు సవాళ్లన్నింటినీ అధిగమించి, విజయం సాధించారు. "మేము గత ఏడాది కూడా కుంకుమ పువ్వు సాగుకు యత్నించాం. కానీ అధిక వర్షాల వల్ల పంట సరిగా చేతికి రాలేదు. చాలా తక్కువ పువ్వులు వచ్చాయి. అవి కూడా వర్షం వల్ల పాడయ్యాయి. అధికారులు వచ్చి మాకు దిశానిర్దేశం చేశారు. పంటను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. ఈసారి 100% విజయవంతం అయ్యాం. ఇది సంతోషకరం." అని అక్కడి రైతు రామమూర్తి తెలిపారు.
తొలి దశలో 150 కిలోల విత్తనాలు వచ్చాయి. వీటి ద్వారా మరిన్ని విత్తనాలు ఉత్పత్తి చేసి, ఇతర ప్రాంతాల్లోనూ సాగును విస్తరించాలని కృషి విజ్ఞాన్ కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరించాలని కృషి విజ్ఞాన్ కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
"కుంకుమ పువ్వు సాగు పద్ధతి, మేము సాధించిన ఫలితాలతో కూడిన వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. రాష్ట్ర స్థాయి విధాన రూపకల్పనకు సిఫార్సు చేస్తాం. తర్వాత వాళ్లు అధికారులతో చర్చించుకుని ఏం చేయాలో చేస్తారు. ఇంతకుముందు ఇక్కడ స్ట్రాబెర్రీ పంట ఉండేది కాదు. ఇప్పుడు కుంకుమ పువ్వు విషయంలోనూ అదే జరుగుతుంది."
-డాక్టర్ వెంకట సుబ్రమణియన్, వ్యవసాయ శాస్త్రవేత్త
కుంకుమ పువ్వు సాగుతో ఇడుక్కిలో వ్యవసాయ రంగం పుంజుకుంటుందని రైతులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.