Sadhu Burnt Alive in Kannauj : ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌లోని ఓ ఆశ్రమంలోని 20 ఏళ్ల సాధువుకు నిప్పంటించారు దుండగులు. ఈ ఘటన గురుసాహిగంజ్లోని జలేశ్వర్ ఆశ్రమంలో మంగళవారం రాత్రి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధువు శివమ్‌ను కాపాడి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పంపించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
నంబర్దర్ కుమారులు అనిల్, అలోక్, సాధు రామేశ్వర్ దాస్, రఘునాథ్ దాస్, భోళా దాస్ తనకు నిప్పటించారని సాధువు శివమ్ పోలీసులకు చెప్పారు. ఆశ్రమ మహంత్ నియామకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ అమిత్ కుమార్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఊపిరాడక నిద్రలోనే ఐదుగురు కుటుంబసభ్యులు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహలో హృదయ విదారక ఘటన జరిగింది. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ జరిగింది
సైదంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లీపుర్ బుఢ్ గ్రామానికి చెందిన రషీదుద్దీన్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. రోజులాగే సోమవారం రాత్రి కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేశారు. చలి ఎక్కువగా ఉండడం వల్ల నిద్రపోయేందుకు వీలుగా ఇంట్లోనే బొగ్గు కుంపటిని పెట్టుకున్నారు. అయితే, కుంపటి నుంచి వచ్చిన పొగతో ఊపిరాడక ఇంట్లోని ఐదుగురు నిద్రలోనే తనువు చాలించారు.
మంగళవారం తెల్లవారినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం వల్ల అనుమానించిన స్థానికులు తలుపు కొట్టగా ఎవరూ స్పందించలేదు. దీంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగా కుటుంబసభ్యులు అందరూ అపస్మారక స్థితిలో కనిపించారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఐదుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపించారు. అయితే, మరణానికి గల అసలు కారణం పోస్ట్‌మార్టం పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తాయని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నిద్రలోనే చనిపోవడం వల్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీకి నిప్పు.. వారంపాటు నరకం అనుభవించి మృతి