Sachin Pilot vs Ashok Gehlot : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రమవుతున్నాయి. ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకురాలు వసుంధర రాజేపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రశంసలు కురిపించడం వివాదానికి దారితీసింది. 2020లో సచిన్ పైలట్ నేతృత్వంలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజే ఆదుకున్నారని ధోల్‌పుర్‌లో గత ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సచిన్ పైలట్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గహ్లోత్ నాయకురాలు సోనియాగాంధీనా లేక వసుంధర రాజేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై పొగడ్తలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి.. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలనే అవమానిస్తున్నారని పైలట్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే చర్యలను తాము ఉపేక్షించబోమని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మే 11 నుంచి ఐదు రోజులు అజ్మేర్ నుంచి జయపురకు జన సంఘర్షణ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. యాత్ర తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
"ధోల్‌పుర్‌లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన నాయకురాలు సోనియాగాంధీ కాదు, వసుంధర రాజే సింధియా అని నాకు అనిపించింది. ఒకవైపు మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతూ.. ఇంకోవైపు ప్రభుత్వాన్ని కాపాడే పని వసుంధర చేస్తున్నారని చెప్పడం విరుద్ధంగా ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టం చేయండి. వసుంధర రాజే హయాంలో భారీగా అవినీతి జరిగిందని నేను, అశోక్ గహ్లోత్ ఆరోపించాం. అయినా సరే ఎందుకు విచారణ జరపడం లేదనేది ఇప్పుడే అర్థం అవుతోంది. ఏప్రిల్ 11న ఈ విషయంపై నేను నిరసన తెలిపాను. ఇప్పుడు అర్థమైంది. నిజాలు బయటికి వస్తున్నాయి. దర్యాప్తు ఎందుకు జరగలేదు, ఇకపై ఎందుకు జరగదో స్పష్టమైంది."
--సచిన్ పైలట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
2020 జులైలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గహ్లోత్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అధిష్ఠానం జోక్యంతో ఆ సంక్షోభానికి తెరపడింది. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు. ఆ పరిణామాలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వసుంధర రాజే సహా కొందరు బీజేపీ నేతలు తనకు అనుకూలంగా వ్యవహరించారని గహ్లోత్ చెప్పారు. అయితే గహ్లోత్ వ్యాఖ్యలను వసుంధర రాజే ఇప్పటికే ఖండించారు. ఇదో కుట్రగా అభివర్ణించిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాననే భయం గహ్లోత్‌లో కనిపిస్తోందన్నారు. సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.