Sachin Pilot On BJP : ప్రస్తుతం రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌తో సహా అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు.. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా శనివారం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు పదునుపెట్టే ఈ సమావేశాలు ఎంతో కీలకమని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చెప్పారు. రాజస్థాన్‌లో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయాన్ని తిరగరాస్తామని ఓ ఇంటర్వ్యూలో ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Five State Election 2023 : రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ కలిసికట్టుగా పనిచేస్తే రాజస్థాన్‌లో బీజేపీని ఓడించగలమని సచిన్ పైలట్ చెప్పారు. 2018 ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తామంతా ఐకమత్యంగా పోరాడి, అధికారం మరోసారి చేజిక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తదుపరి ఏర్పాటయ్యే తమ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతుందని అన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ పూర్తిగా చతికిలపడిపోయిందని.. ఆ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని పైలట్ విమర్శించారు. ఎన్నికల్లో విజయానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా.. సంప్రదాయంపైనే బీజేపీ ఆశలు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.
Congress Working Committee Reorganisation : ఇదిలా ఉండగా.. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ- సీడబ్ల్యూసీలో సచిన్ పైలట్‌ను కొత్తగా తీసుకున్నారు. అంతకుముందు రాష్ట్రంలో సీఎం అశోక్ గహ్లోత్‌తో కొనసాగిన వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు సచిన్ పైలట్ జులైలో ఓ ప్రకటన తెలిపారు.
మరోవైపు.. సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ముఖ్యమంత్రులతోపాటు అగ్రనాయకత్వమంతా 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉండనుంది. ఇటీవలే సీడబ్ల్యూసీకి సభ్యులను, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులను నియమించింది. ఈ కొత్త కమిటీకి ఇదే మొదటి సమావేశం.