శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. మంగళవారం మధ్యాహ్నం మండల పూజ నిర్వహించిన నేపథ్యంలో అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ప్రధాన అర్చకులు కందరారు రాజీవరు ఈ పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి బంగారు ఆభరణాలు అలంకరించి.. సన్నిధానానికి తీసుకొచ్చారు. కలశాభిషేకం, కలభాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం 'స్వామియే శరణమయ్యప్ప' అనే నినాదాలతో మార్మోగింది.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక సభ్యులు సైతం పూజకు హాజరయ్యారు. ఈ పూజతో.. 41రోజుల పాటు సాగే వార్షిక తీర్థయాత్ర సీజన్ తొలి విడత ముగిసినట్లైంది. మధ్యాహ్నం పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసిన అర్చకులు.. సాయంత్రం భక్తుల కోసం మళ్లీ తెరిచారు. అనంతరం రాత్రి పూట గుడిని మూసివేయనున్నారు. మూడురోజుల విరామం అనంతరం ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మకరవిళక్కు కార్యక్రమం కోసం తెరుస్తారు. దీంతో తీర్థయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది. 2023 జనవరి 14న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసేస్తారు. దీంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగుస్తుంది.
కాగా, మండల పూజ కాలంలో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 39 రోజుల వ్యవధిలో రూ.222.98 కోట్లు భక్తుల నుంచి కానుకల రూపంలో అందినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. సుమారు 30 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని... అందులో ఐదో వంతు చిన్నారులే ఉన్నారని వెల్లడించింది. గడిచిన రెండేళ్లలో రాలేకపోయిన నేపథ్యంలో ఈసారి చిన్నారులు భారీ సంఖ్యలో దర్శనానికి వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.