S Jaishankar Security Category : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతను Y కేటగిరీ నుంచి Z కేటగిరీకి పెంచింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జైశంకర్‌కు భద్రత కల్పిస్తున్న దిల్లీ పోలీసుల బాధ్యతలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్- CRPF తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ కోరినట్లు చెప్పాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
S Jaishankar Latest News : జెడ్ కేటగిరీ కింద 14-15 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు.. షిఫ్ట్‌లు వారీగా 24 గంటల పాటు జైశంకర్‌కు భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కమాండోలు.. దేశంలోని 176 మందికి రక్షణ కల్పిస్తున్నారు. వారిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు అనేక మంది ప్రముఖులు ఉన్నారు.
జైశంకర్ సమీక్షా సమావేశం
Israel Operation Ajay : మరోవైపు, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకుగాను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా బుధవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్ సన్నద్ధతపై జైశంకర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే 230 మంది ప్రయాణికులతో కూడిన మొదటి ప్రత్యేక విమానం గురువారం రాత్రి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌కు బయల్దేరనున్నట్లు సమాచారం
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయుల ప్రయాణ ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఇజ్రాయెల్ నుంచి రాకపోకలు సాగించే విమానాలను ఇటీవల ఎయిర్ ఇండియా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ విమానాల్లో భారత్‌కు రావాల్సిన వారినీ తరలించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సహాయక కేంద్రాలను (హెల్ప్‌లైన్) దిల్లీ, టెల్ అవీవ్, రమల్లాల్లో ఏర్పాటు చేసింది. భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సాయం చేయడానికి విదేశాంగశాఖ బృందం సిద్ధంగా ఉందని అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేలమంది భారతీయులు ఉన్నారు. వారిలో దాదాపు 14 వేల మంది కేర్‌టేకర్లే. వీరితోపాటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు తదితరులున్నారు. ప్రస్తుతం వారిని సంప్రదించేందుకు ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ విస్తృత కార్యాచరణ చేపడుతోంది.