త్రిపుర పురపాలక ఎన్నికల్లో (Tripura local body election results) భాజపా దూసుకెళ్తోంది. అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)తో పాటు 13 పురపాలికల్లో సత్తా చాటింది. 51 సభ్యులున్న ఏఎంసీలో భాజపా (BJP tripura election result) క్లీన్ స్వీప్ చేసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్ని స్థానాలు భాజపా వశం కాగా.. టీఎంసీ, సీపీఎం ఖాతా తెరవలేక పోయాయని వెల్లడించింది.
ఖోవై, కుమార్ఘాట్ మున్సిపల్ కౌన్సిళ్లతో పాటు సబ్రూమ్ నగర్, అమర్పుర్ పంచాయతీలను భాజపా తన ఖాతాలో వేసుకుంది. ధర్మపుర్, అంబాస మున్సిపాలిటీలు, కైలాశహర్, తెలియామురా, మెలాఘర్, బెలోనియా మున్సిపల్ కౌన్సిళ్లతో పాటు పానిసాగర్, జిరానియా, సోనాపుర నగర్ పంచాయతీలలోనూ భాజపా పైచేయి సాధించింది. ఎన్నికలు జరిగిన 222 స్థానాల్లో భాజపా.. 217 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. సీపీఎం మూడు సీట్లు గెలుచుకోగా.. టీఎంసీ, టిప్ర మోత పార్టీ ఒక్కో స్థానానికి పరిమితమయ్యాయి.
112 ఏకగ్రీవం..
మొత్తం 334 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది కమలం పార్టీ. 112 స్థానాల్లో భాజపా మద్దతు ఉన్న సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 222 చోట్ల ఎన్నికలు నిర్వహించారు.
'టీఎంసీ అవసరం లేదు'
ఫలితాల సరళిపై స్పందించిన భాజపా ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్.. రాష్ట్రానికి టీఎంసీ పార్టీ అవసరం లేదని తాజా ఫలితాలు స్పష్టం చేశాయని అన్నారు. ఇక్కడి ప్రజలకు కాషాయపార్టీ పైనే విశ్వాసం ఉందని చెప్పారు. భాజపాతో త్రిపుర ప్రజలకు ఉన్న బంధం చాలా బలమైనదని వ్యాఖ్యానించారు. కిరాయి వ్యక్తులతో త్రిపురలో ప్రచారం చేశారని టీఎంసీని విమర్శించారు. భాజపా తన అభ్యర్థులను నిలబెట్టకపోతే తప్ప టీఎంసీ ఇక్కడ ఖాతా తెరవదని ఎద్దేవా చేశారు.
విజయానికి ఇది పునాది: టీఎంసీ
మరోవైపు, టీఎంసీ (TMC in Tripura election) మాత్రం ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. సీపీఎంను వెనక్కి నెట్టి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశాలు తమ పార్టీకి ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తాజా ఫలితాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను సూచిస్తున్నాయని టీఎంసీ బంగాల్ కార్యదర్శి కునాల్ ఘోష్ పేర్కొన్నారు. అనేక సీట్లలో పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. '2023 మాదే. తాజా ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ విజయానికి (2023లో విజయానికి) పునాదులు వేశాయి. అనేక వర్గాల ప్రజల మద్దతును కూడగట్టడంలో టీఎంసీ సఫలమైంది' అని ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పార్టీ తరపున పోరాడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
హింసామార్గంలో భాజపా విజయం సాధించిందని ఘోష్ ఆరోపించారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు.. భాజపాకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు.
ఇదీ చదవండి: పెగసస్, నిరుద్యోగంపై చర్చకు విపక్షాల డిమాండ్