నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదించే సమయంలో రాజ్యసభ టీవీ ఆడియో ఫీడ్‌కు కొద్దిసేపు అంతరాయం కలగడంపై సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(సీపీడబ్ల్యూడీ) స్పష్టతనిచ్చింది. కొంతమంది పార్లమెంట్ సభ్యుల కారణంగా ఛైర్మన్ మైక్రోఫోన్ దెబ్బతినడం వల్లే అంతరాయం ఏర్పడిందని తెలిపింది. పార్లమెంట్ భవన నిర్వహణను పర్యవేక్షించే సీపీడబ్ల్యూడీ.. ఈమేరకు రాజ్యసభ సచివాలయానికి లేఖ రాసింది.
"సెప్టెంబర్ 20న రాజ్యసభ సమావేశాల ఆడియో ఫీడ్‌కు.. మధ్యాహ్నం 1.05 గంటల నుంచి 1.35 గంటల వరకు అంతరాయం ఏర్పడింది. ఛైర్మన్ మైక్రోఫోన్‌ను గౌరవనీయులైన ఎంపీలు ధ్వంసం చేయడం వల్ల వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగే సమయంలో ఈ అంతరాయం కలిగింది."
-లేఖలో సీపీడబ్ల్యూడీ
ఆ సమయంలో ఛైర్మన్ మైక్ మినహా ఏ ఇతర మైక్రోఫోన్ కూడా ఆన్‌లో లేదని తెలిపింది సీపీడబ్ల్యూడీ. దీనికి మరే ఇతర సాంకేతిక సమస్యలు లేవని స్పష్టం చేసింది. సంబంధిత నిబంధనల అనుసారం ఆడియోను పునరుద్ధరించడానికి అరగంట సమయం పట్టిందని వివరించింది.
రాజ్యసభ సమావేశాల్లో కావాలనే ఆడియోను రానీయకుండా చేశారని విపక్ష పార్టీలు గతంలో ఆరోపణలు చేశాయి. తమ అభిప్రాయాలు ప్రజలకు వినిపించకుండా చేసేందుకే ఇలా చేశారని మండిపడ్డాయి.
డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ రాజ్యసభలో ఉండగా వ్యవసాయ బిల్లులను పెద్దల సభ ఆమోదించింది. చట్టాలపై ఓటింగ్ నిర్వహించాలని విపక్ష పార్టీల డిమాండ్‌తో సభలో తీవ్ర గందరగోళం తలెత్తింది.
ఇదీ చదవండి