Ancient Statues Recovered: పురాతన విగ్రహాలు చోరి చేసి విక్రయించే ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.40 కోట్లు విలువ చేసే 12 పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 11వ శతాబ్దానికి చెందిన నటరాజ విగ్రహం, అరుదైన రావణ, పార్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి.
తరచూ పురాతన విగ్రహాలను కొనుగోలు చేసే వ్యక్తి అందించిన సమాచారం మేరకు గత నెలరోజులుగా మహాబలిపురంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఓ వ్యక్తి పార్వతి దేవి విగ్రహం విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి మరో 11 విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
30 ఏళ్లగా స్మగ్లింగ్..
నిందితుడు కశ్మీర్‌కు చెందిన జావేద్ షాగా అధికారులు గుర్తించారు. అతడు 30 ఏళ్లుగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే గత 5 ఏళ్లుగా మహాబలిపురంలోని ఈ హోటల్ కేంద్రంగా విదేశాలకు పురాతన విగ్రహాలను నిందితుడు విక్రయిస్తున్నాడన్నారు. నిందితుడితో పాటు ఈ అక్రమాలకు పాల్పడ్డ అతని సోదరుడు ప్రస్తుతం కశ్మీర్లో తలదాచుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : ఇస్రో కొత్త ఛైర్మన్‌గా రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్