స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) అనే జన్యు సంబంధ సమస్యతో బాధపడుతున్న 14 నెలల చిన్నారికి ఉచిత చికిత్స అందింది. బెంగళూరుకు చెందిన మహ్మద్ బాసిల్, ఖదీజా దంపతుల కుమార్తె ఫాతిమా ఎస్ఎంఏతో బాధపడుతోంది. జోల్గెన్స్మా అనే జన్యు చికిత్స ద్వారానే ఈ వ్యాధి నయమవుతుందని వైద్యులు తెలిపారు.
ఈ చికిత్సకు దాదాపు రూ.16 కోట్లు ఖర్చు కానుండగా.. బెంగళూరుకు చెందిన బాప్టిస్ట్ ఆస్పత్రి ఈ చికిత్సను ఉచితంగా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఆస్పత్రి, ప్రముఖ ఔషధ సంస్థ నొవార్టిస్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా లాటరీ ద్వారా ఈ చిన్నారిని ఎంపిక చేసి చికిత్స చేయించారు.
ఖరీదైన మందులను మంగళవారం ఈ చిన్నారికి అందించినట్లు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ నవీన్ థామస్ వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ అరుదైన వ్యాధి పీడుతులకు మెరుగైన చికిత్సలు అందిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్ ఫండింగ్