స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ ఎత్తుగడలు బ్రిటిష్ వారికి, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌వారికీ ఓ పట్టాన అర్థం అయ్యేవికావు. అలాంటిదే 1940 అక్టోబరు 17న మొదలెట్టిన (why Personal Satyagraha) వ్యక్తిగత సత్యాగ్రహం! పదిమంది గుమిగూడితేనే కాదు.. ఒక్కరు సైతం బలమైన శక్తేనని ఈ సత్యాగ్రహం నిరూపించింది.
రెండో ప్రపంచయుద్ధం (1939-1945) మొదలుకాగానే... భారత్ కూడా అందులో భాగమవుతోందని బ్రిటన్ ప్రకటించింది. భారతీయులు ఎక్కువ సంఖ్యలో సైన్యంలో చేరటం బ్రిటన్‌కు అవసరం. కాంగ్రెస్ మద్దతిస్తే ఆ పని సులువవుతుంది. కానీ తమ నాయకులతో సంప్రదించకుండానే చేసిన ఈ ఏకపక్ష ప్రకటనను గాంధీజీ నేతృత్వంలోని కాంగ్రెస్ తిరస్కరించింది. "నాజీల ఫాసిజానికి మేం వ్యతిరేకం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను కాపాడాలనుకుంటున్న బ్రిటన్ (why Personal Satyagraha) మిత్రపక్షాల వాదనను సమర్థిస్తాం. అయితే ఒకవంక భారత్‌ను బానిసగా చూస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధమంటూ బ్రిటన్ ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోంది. దీనికి మేం వ్యతిరేకం. భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటిస్తేనే యుద్ధంలో బ్రిటన్ మిత్రదేశాలకు మద్దతుగా నిలుస్తాం" అని గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. కానీ బ్రిటన్ ఈ స్వాతంత్య్రం మాట పక్కనబెట్టి.. తాయిలాలు ప్రకటించింది. యుద్ధం ముగియగానే స్వయం ప్రతిపత్తి ఇస్తామని, పాలనలో మరింత వెసులుబాటు కల్పిస్తామని, మైనారిటీల (ముస్లింలీగ్) అంగీకారం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోమని దువ్వటం ఆరంభించింది. తొలి ప్రపంచయుద్ధం సమయంలోనూ ఇలాంటి కల్లబొల్లి మాటలే చెప్పి మోసం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ వీటన్నింటినీ తోసిపుచ్చింది. సంపూర్ణ స్వాతంత్య్రం విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లోని తమ నాయకులందరితో రాజీనామా చేయించి బ్రిటన్‌పై ఒత్తిడి పెంచింది.
బ్రిటీష్ తాయిలాలు..
1940 జూన్‌లో ప్రపంచయుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జర్మనీకి ఫ్రాన్స్ లొంగిపోయింది. బ్రిటన్ పరిస్థితి కూడా నేడోరేపో అనేలా మారింది. ఈ తరుణంలో కాంగ్రెస్ మరోమారు... 'స్వాతంత్య్రం ఇవ్వండి... యుద్ధంలో మద్దతిస్తాం' అంటూ స్పష్టం చేసింది. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ ఇంకా ఎత్తుగడలు వేసింది. 'ఆగస్టు ఆఫర్' అంటూ మరికొన్ని తాయిలాలు విసిరింది. పాలనలో మరింతగా భారతీయులను చేర్చుకోవటం; సొంత రాజ్యాంగాన్ని రాసుకోవటానికి వీలుకల్పించటం; మైనారిటీల హక్కులను కాపాడటం.. వీటి సారాంశం. స్వాతంత్య్రం ఇవ్వకుండా, విభజించు పాలించు సూత్రానికి బ్రిటిష్ ప్రభుత్వం పదనుపెడుతోందని స్పష్టమైంది. కాంగ్రెస్ ఈ ఆఫర్‌ను కూడా తిరస్కరించింది. పెద్దఎత్తున సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభించాలని గాంధీజీపై అతివాదులు ఒత్తిడి తెచ్చారు. కానీ ఆయన మరో వ్యూహాన్ని అనుసరించారు. వ్యక్తిగత సత్యాగ్రహానికి నిర్ణయించారు. ప్రజలు గుంపులుగుంపులుగా కాకుండా ఎంపిక చేసిన ఒక్కరు మాత్రమే (ఒకరి తర్వాత ఒకరు) పాల్గొనటం వ్యక్తిగత సత్యాగ్రహం ప్రత్యేకత. ఎంపిక చేసిన సత్యాగ్రహి పట్టణం మధ్యలో నిలబడి... ప్రపంచయుద్ధంతో తమకు సంబంధం లేదని... స్వాతంత్య్రం కావాలని నినదిస్తారు. ఫాసిస్టు శక్తులను వ్యతిరేకిస్తూనే భారత భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచానికి చాటడం ఇందులోని ఆంతర్యం!
తొలి సత్యాగ్రహి వినోబా
వినోబా భావే ఈ ఉద్యమంలో గాంధీజీ ఎంపిక చేసిన తొలి సత్యాగ్రహి! 1940 అక్టోబరు 17న వార్ధాలోని పౌనార్‌లో వినోబాభావే తొలి వ్యక్తిగత సత్యాగ్రాహిగా రంగంలోకి దిగారు. పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వంతు గోరఖ్‌పూర్‌లో నెహ్రూది. ఆయన్ను అరెస్టు చేసి నాలుగున్నర సంవత్సరాల ఖైదు విధించారు. దీంతో ఆందోళన రేగింది. మిగిలిన కాంగ్రెస్ నేతలంతా దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహంలోకి దిగటంతో బ్రిటిష్ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోలేదు. అరెస్టులు, విడుదలతో సాగిపోయింది. కొద్దిరోజులకు గాంధీజీ ఈ సత్యాగ్రహాన్ని ఆపేశారు. లక్ష్యాన్ని సాధించకుండానే ముగిసినట్లనిపించినా.. భారత్ సంపూర్ణ స్వరాజ్యానికి తప్ప ఇక దేనికీ లొంగబోదని స్పష్టంచేసిందిది. కీలక సమయంలో తమను ఇబ్బంది పెట్టకుండా అహింసా మార్గంలో ఉద్యమించటం బ్రిటిష్ ప్రభుత్వానికీ కాసింత ఊరటనిచ్చింది. తర్వాతి పరిణామాల్లో దీని ప్రభావం కన్పించింది.
ఇదీ చదవండి:అఖండ భారత ఐక్యతా హారతిగా.. భారతమాత మందిరం