మహారాష్ట్ర లాతుర్‌లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఓ ఇంట్లో నుంచి రూ.రెండు కోట్లు సహా కిలో బంగారాన్ని దొంగిలించారు. ఐదుగురు దొంగలు వచ్చి తమ కుటుంబ సభ్యులను బెదిరించి నగదును ఎత్తుకెళ్లారని బాధితుడు రాజ్‌కుమార్ తెలిపాడు. ఇందులో ముగ్గురు 25-30 ఏళ్ల మధ్య వారు కాగా.. మరో ఇద్దరు 35 ఏళ్ల పైబడిన వారని చెప్పాడు.
బాధితుడు రాజ్‌కుమార్ అగర్వాల్ వివేకానంద చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవనక రింగ్ రోడ్డులో నివసిస్తున్నాడు. మిలటరీ దుస్తులు, ముసుగులు ధరించి వచ్చిన ఐదుగురు దొంగలు.. తుపాకులు, కత్తులతో బెదిరించారు. అనంతరం రూ.2కోట్ల నగదు, కిలో బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.
దొరికిన బంగారాన్ని తిరిగి అప్పంగించిన వ్యక్తి:
కర్ణాటకలో ఓ కుటుంబం పోగొట్టుకున్న 30తులాల బంగారం తిరిగివెతుక్కుంటూ వారి తలుపుతట్టింది. గురురాజ్ అనే ఓ వ్యక్తి తనకు దొరికిన 3వందల గ్రాముల బంగారాన్ని నిజాయతీతో తిరిగి వారి చెంతకు చేర్చాడు. తుమకూరుకు చెందిన అర్పిత దంపతులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు. రైలు ప్లాట్‌ఫాం పైకి వచ్చిందన్న ఆందోళనలో తమ వెంట తెచ్చుకున్న బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును రైల్వేస్టేషనులోని లిఫ్టులో మరచిపోయారు.
తీవ్ర ఆవేదనకు గురైన ఆ కుటుంబ సభ్యులు.. పోలీసు స్టేషనులో కేసు నమోదు చేశారు. వక్కోడిలో న్యాయస్థానంలో పని చేస్తున్న గురురాజ్‌కు ఆ బ్యాగు దొరికింది. ఆ బ్యాగును బాధితులకు అప్పగించాలని పోలీసులను కోరారు. వివరాలు సేకరించిన పోలీసులు బాధితుల చిరునామా వెల్లడించగా గురురాజ్ వారి ఇంటికి వెళ్లి ఆ బంగారాన్ని వారికి అప్పగించారు. పోగొట్టుకున్న తమ బంగారం తిరిగి వారిని వెతుక్కుంటూ రావడంపై ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: నాటకం మధ్యలో గుండెపోటుతో శివుడి పాత్రధారి మృతి
'వారిని చంపి, వండుకుని తినేసిన భార్యాభర్తలు!'.. నరబలి కేసులో షాకింగ్ నిజాలు