రాజస్థాన్, శ్రీగంగానగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనూప్‌గఢ్ ప్రాంతంలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఏం జరిగింది...?
శ్రీగంగానగర్ జిల్లా కేంద్రం నుంచి మొహాంగఢ్కు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అనూప్‌గఢ్ ప్రాంతంలో అనూప్‌గఢ్-బికెనీర్ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అనూప్‌గఢ్ పోలీసులకు, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అగ్మిమాపక సిబ్బంది. అధికారులు, స్థానికులు, బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
బస్సులో నలుగురు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. వారి శరీరాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారయని వెల్లడించారు. మరో 12 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అయితే.. ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియదన్నారు. గాయపడిన వారిలో లారీ డ్రైవర్ ఉన్నాడని చెప్పారు.
ఇదీ చూడండి: రైలు కింద పడిన మహిళ- తప్పిన ప్రమాదం