Conjoined Twins Separated Successfully : ఉత్తర్‌ప్రదేశ్‌లో గతేడాది అవిభక్త కవలలుగా జన్మించిన రిద్ధి, సిద్ధిలను శస్త్ర చికిత్స ద్వారా విడదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు. బరేలీకి చెందిన దీపికా గుప్తా, నాలుగో నెల గర్భం ఉన్నప్పుడే కడుపులో అవిభక్త కవలలు ఉన్నట్లు స్థానిక వైద్యులు గుర్తించారని ఎయిమ్స్‌లోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి డాక్టర్ మిను బాజ్‌పాయ్ తెలిపారు. దీంతో అత్యాధునిక సౌకర్యాలు గల దిల్లీ ఎయిమ్స్‌కు ఆమెను రిఫర్ చేశారని చెప్పారు.
AIIMS Delhi Conjoined Twins : ఈ క్రమంలో ఛాతీ నుంచి కడుపు వరకూ అతుక్కుపోయి గతేడాది జూలై 7న అవిభక్తులుగా జన్మించిన ఆడ కవల శిశువులను.. అయిదు నెలల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్- ఐసీయూలో ఉంచారు. అనంతరం వారికి శస్త్ర చికిత్సను తట్టుకునే సామర్థ్యం వచ్చిన నేపథ్యంలో గత నెల 8వ తేదీన తొమ్మిది గంటల పాటు శస్త్ర చికిత్సను నిర్వహించి విజయవంతంగా విడదీశారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆ శిశువులిద్దరూ తమ మొదటి పుట్టిన రోజును ఈ నెలలో ఆస్పత్రిలోనే జరుపుకొన్నారు. దీంతో కవలల తల్లిదండ్రులు దీపిక, అంకుర్ గుప్తా.. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 'శస్త్ర చికిత్స జరుగుతున్నప్పుడు మేము చాలా ఆందోళన చెందాము. కానీ దేవుడు, వైద్యులు మా కుమార్తెలకు కొత్త జీవితం ప్రసాదించారు' అని దీపిక సంతోషం వ్యక్తం చేసింది.
'ఈ సర్జరీ చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఈ కవలల్లో పక్కటెముకలు, కాలేయాలు, పాక్షికంగా డయాఫ్రామ్, పెరికార్డియం (గుండె బయటి కవచం) కలిసి ఉన్నాయి. రెండు గుండెలు ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉన్నాయి. పెరికార్డియం పాక్షికంగా కలిసిపోయింది' అని పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ప్రబుద్ గోయెల్ తెలిపారు. 'సాధారణ పొత్తికడుపు, ఛాతీ వేరు చేయడం, ఇద్దరికి తగినంత కణజాలం ఉండే విధంగా కాలేయ కణజాల విభజన, అతక్కుపోయిన పక్కటెముక విభజన, డయాఫ్రామ్, పెరికార్డియం వేరు చేయడం లాంటివి ఈ శస్త్ర చికిత్సలో చేశాము' అని డాక్టర్ మిను బాజ్‌పాయ్ వివరించారు. దిల్లీ ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం రిద్ధి, సిద్ధితో కలిపి గత మూడేళ్లలో మూడు జతల కవలలను విజయవంతంగా వేరు చేసింది. మొదటి ఆపరేషన్ 2020, రెండవది 2021లో జరిగింది.