Revanth Reddy Biography and Real Life Story : రేవంత్‌రెడ్డి ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఒకే పదం వినిపిస్తోంది అదే దూకుడు, తనదైన మాటలు, చురుకుదనం. జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న ఏకైక నేతగా నిలిచారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, జైలు జీవితం అనుభవించినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కర్తవ్యంతో ముందుకు సాగి విజయం సాధించారు. కేవలం తనదైన మాటలతోనే ప్రత్యర్థి పార్టీల నేతలకు గుండెల్లో సునామీ సృష్టించిన జననేత. తెలంగాణ ప్రపంచం మొత్తం కేసీఆర్‌ను ఢీకొనే వ్యక్తి కేవలం రేవంత్‌రెడ్డి మాత్రమే అన్నంతలా సాగింది ఈ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి దూకుడు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం : తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అనుముల రేవంత్‌రెడ్డి. ఆయన 1969 నవంబరు 8వ తేదీన నాటి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. ఆయన తండ్రి నర్సింహా రెడ్డి, తల్లి రామచంద్రమ్మ. మహబూబ్‌నగర్‌లోని ఏవీ కాలేజ్ నుంచి కామర్స్‌లో బీఏ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో విద్యార్థి నాయకుడిగా పని చేసిన రేవంత్ అనంతరం రాజకీయ జీవితంవైపు మొగ్గు చూపి ఓయూలోని విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చారు. రేవంత్ రెడ్డికి తన 24వ ఏటనే కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సోదరుడు కుమార్తె గీతతో వివాహం జరిగింది. వారికి నైమిష అనే కుమార్తె ఉంది. అనంతరం మిడ్జిల్ జడ్పీటీసీగా స్వతంత్రంగా ఎన్నికై అనంతరం టీడీపీతో జత కట్టి తెలంగాణలో బలమైన నాయకుడిగా ఎదిగారు. రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రయాణం : ప్రజలను తన మాట తీరుతో ఆకట్టుకునే సహజ స్వభావం, ప్రచారంలో తనదైన వ్యూహాలను అనుసరించడంతో దిట్ట రేవంత్‌రెడ్డి. ఈ రెండు విషయాలు తనను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయని అనడంలో సందేశం లేదు. తనకంటూ ఒక బలమైన కేడర్‌ను పెంచుకుని 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు వేశారు. మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్రంగా బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత 2007లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు.
ఎమ్మెల్యేగా తొలి గెలుపు : తన కుటుంబమంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తున్నా తాను మాత్రం 2008లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. మొదటి ప్రస్థానంలోనే బడా నేతపై గెలుపొందడంతో అందరి చూపు అతనిపై పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడి ఉన్నారు. మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలవడంతో పాటు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా కూడా బాధ్యతలు స్వీకరించారు.
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడుగా నియామకం : అనంతరం తెలంగాణలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీయడంతో 2017లో రేవంత్‌రెడ్డి మరికొందరు నాయకులతో సహా దిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా నియమితులై ఆ తర్వాత 2021లో పీసీసీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితంలో మాయని మచ్చలా ఓటుకు నోటు కేసు మిగిలిందనేది వాస్తవం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్‌రెడ్డి ఆ ఎన్నికలో ఓటమి పాలై, ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేవలం ఆరు నెలల్లోనే పదవిని సంపాదించి తానేంటో నిరూపించుకున్నారు.
వన్ మ్యాన్ ఆర్మీ : 2023లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకువస్తానని చెప్పి పీసీసీ పీఠమెక్కారు. పీసీసీ గద్దె ఎక్కినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తానని రేవంత్ నొక్కివక్కాణించి చెబుతూనే వస్తున్నారు. చెప్పడమే కాదు చేసి చూపించాలని ఆ దిశగా తన ప్రయత్నం చేస్తూ సాగారు. సొంత పార్టీ నేతల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా, అధికార పార్టీ ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినా అవేం లెక్కచేయకుండా పక్కా ప్లాన్‌తో ఈ ఎన్నికల్లో వన్ మ్యాన్ ఆర్మీలా దూసుకెళ్లారు.
ఈ గెలుపును తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన రేవంత్ ఆ మాట నిలబెట్టుకున్నారు. అందుకోసం తనను ఛీ అన్న వారితో కూడా కలివిడిగా కలిసిపోయి వారి మనసు మార్చి తనవైపు తిప్పుకుని ఈ ఎన్నికల్లో ముందుకు సాగారు. ఇక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రత్యేక ప్రణాళికతో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లారు. అలా పాదయాత్రతో తన గెలుపు ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ బస్సు యాత్రలు, విజయభేరి సభలు, రోడ్ షోలు, సుడిగాలి పర్యటనలు చేస్తూ తన మాట తీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తెచ్చిన నేత : ఓవైపు సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో గట్టి పోటీనిచ్చి మరోవైపు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అలా అసలు ఉణికే కోల్పోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీలో జోష్ తీసుకువచ్చి రాష్ట్రంలో ఇప్పుడు గద్దెనెక్కే వరకు తీసుకొచ్చారు. ఇక తన సొంత గెలుపు కోసం కూడా ఎంతో శ్రమించి కొడంగల్‌లో గెలిచి తానేంటో నిరూపించుకున్నారు.