కొందరు ప్రభుత్వ అధికారులు పదవీ విరమణ పొందిన వెంటనే ప్రైవేటు ఉద్యోగాల్లో చేరుతుండటంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దిష్ట కూలింగ్-ఆఫ్ కాలావధి పూర్తికాకుండా అలా చేరడం తీవ్ర దుష్ప్రవర్తన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
పదవీ విరమణ అనంతరం కూలింగ్-ఆఫ్ కాలావధి ముగిసిన తర్వాతే అధికారులు ప్రైవేటు సంస్థల్లోకి వెళ్లేలా చూడాలని సీవీసీ ఆదేశించింది. తదనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉండాలని పేర్కొంది.