దేశంలో స్త్రీల కంటే పురుషుల నిష్పత్తే ఎక్కువ. 1000మంది మగవారికి కేవలం 900మంది మహిళలే ఉన్నారు. అయితే త్రిపురలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ 1000 మంది పురషులకు 1011మంది స్త్రీలు ఉన్నట్లు తాజా నివేదికలో తేలిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్ నాథ్ వెల్లడించారు.
పట్టణాలతో పోల్చితే గ్రామాల్లోనే స్త్రీల నిష్పత్తి అధికంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. పట్టణాల్లో 1000మందికి 956 స్త్రీలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంఖ్య 1033గా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
త్రిపురలో ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితి గత కొన్నేళ్లుగా మెరుగుపడుతున్నట్లు నివేదిక తెలిపిందని రతన్ నాథ్ పేర్కొన్నారు. విద్యుత్ సదుపాయంతో నివసిస్తున్న ప్రజల సంఖ్య 98.2కు చేరినట్లు చెప్పారు. 2015-16లో 63.7 శాతం గృహాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండగా.. 2019-20లో అది 73.6 శాతానికి పెరిగినట్లు వివరించారు.