Karnataka HC Judge: అవినీతి నిరోధక శాఖపై(ఏసీబీ) వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. తనకు బెదిరింపులు వస్తున్నట్లు పేర్కొన్నారు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్‌పీ సందేశ్. కానీ.. తాను వీటికి భయపడనని స్పష్టం చేశారు. అవినీతిని పెకిలించాల్సిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ).. అక్రమార్జనకు కేంద్ర బిందువుగా మారిందని ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా వ్యాఖ్యానించారు జడ్జి.
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ఆనేకల్ సమీపంలోని కూడ్లు గ్రామంలో 38 గుంటల భూ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు బెంగళూరు నగర జిల్లాధికారి(కలెక్టర్) జె.మంజునాథ్ రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బయానాగా ఉప తహసీల్దారు మహేశ్ ద్వారా రూ.5 లక్షలు తీసుకున్న నేపథ్యంలో.. మంజునాథ్‌ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. చేతన్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న మహేశ్‌ను మే 21న అదుపులోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలో మహేశ్ బెయిల్ పిటిషన్‌పై కేసు విచారణలో.. 'అవినీతి నిరోధక శాఖకు పెద్ద పెద్ద అధికారుల అవినీతి కనిపించదా? ఎప్పుడూ జూనియర్ సిబ్బంది మాత్రమే విచారణ ఎదుర్కోవాలా?' అని అన్నారు జస్టిస్ హెచ్‌పీ సందేశ్. ఏసీబీ ఏడీజీపీ కూడా అవినీతి అధికారి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు న్యాయమూర్తి. ఈ సందర్భంగా 2016 నుంచి అన్ని కేసులకు సంబంధించి ఏసీబీ నివేదికలు తమకు సమర్పించాలని జూన్ 29న స్పష్టం చేశారు. అనంతరం తనకు బదిలీ బెదిరింపులు వచ్చాయని చెప్పిన జస్టిస్ సందేశ్.. పదవి పోయినా లెక్కచేయనని అన్నారు.
''నేను ఎవ్వరికీ భయపడను. నేను జడ్జి అయ్యాక ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోలేదు. నా హోదా పోయినా పర్వాలేదు. నేను రైతు కుమారుడ్ని. నేను వ్యవసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నాకెలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడి లేను.''
- జస్టిస్ హెచ్‌పీ. సందేశ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
రాహుల్ ట్వీట్:. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో.. కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 'కర్ణాటక భాజపా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినందుకు.. హైకోర్టు జడ్జిని బెదిరించారు. భాజపా ప్రతి సంస్థనూ అణచివేస్తోంది. నిజాయతీగా విధులను నిర్వర్తించే వారి కోసం ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి.' అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి: పొట్టేళ్లతో వ్యవసాయం.. నాగలితో దున్నడం, బండిని లాగడం అన్నీ వాటితోనే!