అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 56 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు అమర్నాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 28 నుంచి ప్రారంభమై ఆగస్టు 2తో యాత్ర ముగుస్తుంది.
పూర్తిస్థాయి కొవిడ్ నిబంధనలతో ఈ యాత్ర కొనసాగుతుందని బోర్డు గతంలోనే వెల్లడించింది. ఈసారి యాత్ర రెండు మార్గాల ద్వారా ప్రారంభం కానుంది. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని బోర్డు తెలిపింది.
దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు.. 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
3 బ్యాంకుల శాఖల్లో..
దేశవ్యాప్తంగా ఉన్న.. పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్ముకశ్మీర్ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు సంబంధించిన 446 శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ బ్యాంకు శాఖల వివరాలు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్లో ప్రయాణించాలనుకునేవారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్ర మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం