RED SANDALWOOD SMUGGLERS ATTACK ON POLICE: ప్రస్తుత సమాజంలో చిన్న అవసరానికి కూడా డబ్బులు కావాలి. సక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలంటే సమయం పడుతుంది. అదే అక్రమ మార్గంలో అయితే కష్టపడకుండానే వస్తాయి. ఇప్పుడు చాలామంది దానినే ఎంచుకుంటున్నారు. కష్టపడి సంపాదించలేక దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు.. ఇలా ఏది చేయగలిగితే అది చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలంటే చాలా మంది ఎంచుకునేది ఎర్రచందనం స్మగ్లింగ్. ఇందులో చాలా మంది సినిమాలు చూసే ప్రేరణ పొందుతారు.
స్మగ్లింగ్ ఎలా చేయాలి.. డబ్బులు ఎలా సంపాదించుకోవాలని యూట్యూబ్, సినిమాలు చూసి వాటినే ఫాలో అవుతారు. పోలీసులకు తెలియకుండా.. వాళ్ల కళ్లుగప్పి వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటారు. అటువంటి వారిని పట్టుకోవడానికి కూడా పోలీసులు నానా కష్టాలు పడుతుంటారు. ఎర్రచందనాన్ని ఎలా తీసుకెళ్తున్నారో తెలియక తలలు పట్టుకుంటారు. ఒకవేళ పక్కా ఇన్ఫర్మేషన్తో తనిఖీలు చేసినా ఎదో ఒక మార్గంలో తప్పించుకుంటారు. సరిగ్గా ఇక్కడ కూడా అక్రమ మార్గంలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నారని పోలీసులకు కచ్చితమైన సమాచారం వచ్చింది. దీంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. వాళ్లు పోలీసులకే షాక్ ఇచ్చారు. సినిమా స్టైల్ చేజింగ్ చేసినా ఫలితం లేకపోవడంతో దొంగలు పారిపోయారు.. పోలీసులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది.
నెల్లూరు జిల్లాలోని రాపూరు అడవుల నుంచి డక్కిలి మీదుగా కారులో ఎర్రచందనం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఎలాగైనా వారిని పట్టుకోవాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు అప్రమత్తమయ్యారు. అయినా వెనకడుగు వేయకుండా.. ఎర్రచందనం రవాణా కారును డక్కిలి ఎస్.ఐ.., పోలీసు సిబ్బంది కలిసి ఛేజ్ చేశారు. అయితే కారుకు అడ్డొచ్చిన పోలీసులు, వారి వాహనాలను స్మగ్లర్లు వేగంగా ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో ఎస్సై, పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం.
ఇవీ చదవండి: