Rath yatra 2022: జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఊరేగింపునకు నందిఘోష్ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్ (సుభద్ర) రథాలు సిద్ధమయ్యాయి. పూరీ పట్టణం లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతోంది. ఐదు అంచెల బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ సునీల్ బన్సల్ గురువారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా బందోబస్తు చేశామని తెలిపారు. శుక్రవారం ఈ ప్రాంతాన్ని 'నో ఫ్లయింగ్ జోన్' చేయాలని విమానాశ్రయ యంత్రాంగాన్ని కోరామన్నారు. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ జగన్నాథ్ రథ యాత్ర సందర్భంగా కళాఖండాన్ని తీర్చిదిద్దారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం అని సందేశం ఇచ్చేలా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జగన్నాథ్ మందిరంలో మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 'కొవిడ్ వల్ల రెండేళ్లుగా రథయాత్రకు భక్తలను అనుమతించలేదు. ఈ సంవత్సరం మళ్లీ అనుమతిస్తుండటం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఒడిశా ప్రజలు, దేశ ప్రజలకు ఇదొక గొప్ప పండగ' అని గజపతి మహారాజా దిబ్యాసింగ్ దేబ్ అన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు..: రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. 'జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రథయాత్ర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'జగన్నాథుని ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని' అని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: 'ఇప్పుడు నాకు ఎవరూ అడ్డులేరు.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను'