Rashtrapati Bhavan Replica: మహారాష్ట్ర అమరావతికి చెందిన అమర్ మేశ్రామ్ అనే కళారుడు తన ప్రతిభతో అందరి మన్ననలు పొందుతున్నాడు. భారత రాష్ట్రపతి భవనాన్ని పోలిన ఖళాకండాన్ని రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. భవనంలోని 304 గదులను అచ్చుగుద్దినట్లు చెక్కిన ఈ మినీ ప్రెసిడెంట్ బిల్డింగ్ నీలి రంగులో చాలా ఆకర్షణీయంగా కన్పిస్తోంది. దీని తయారీ కోసం కలప, కాగితం, టూత్‌పిక్‌ను వినియోగించాడు అమర్. ఈ కళాకృతి కోసం 6 నెలలపాటు శ్రమించాడు.
అమర్‌కు చిన్ననాటి నుంచి ఇలాంటి కళాకృతులు రూపొందించడమంటే ఆసక్తి. అందుకే చదువు అబ్బలేదు. స్కూల్ పూర్తయ్యాక కాలేజ్‌కి వెళ్లడం మానేశాడు. ఏడో తరగతి నుంచి ఇలాంటి కళాకృతులు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచే నగరంలోని పెద్ద పెద్ద భవనాలను పోలిన కళాఖండాలను తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.
Parliament Replica
కొన్ని నెలల క్రితం మహాత్మా గాంధీ ఛర్ఖాను పోలిన కళాకృతిని ఓ యువకుడు రూపొందించాడనే వార్త చదివాడు అమర్. దాని స్ఫూర్తితోనే మొదట పార్లమెంటును పోలిన భవనాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన వచ్చింది. అనుకున్న విధంగానే పార్లమెంటు ఆకృతిని తయారు చేశాడు. ఇప్పుడు రాష్ట్రపతి భవనం ప్రతిని కూడా రూపొందించాడు.
తన కుటుంబం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమేనని అమర్ చెప్పాడు. తన తండ్రి వ్యవసాయం చేస్తారని, తల్లి ఆయనకు సాయంగా ఉంటుందని పేర్కొన్నాడు. రాష్ట్రపతి భవనం కళాకృతిని రూపొందించేందుకు తన వద్ద డబ్బు లేకపోతే స్నేహితులతో కలిసి పనికి వెళ్లి అవసరమైన మొత్తం కూడబెట్టుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత మెటీరియల్ కొనుగోలు చేసి 6 నెలలు శ్రమించి కళాకృతిని పూర్తి చేసినట్లు వివరించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన ప్రతిభను గుర్తిస్తే మరింత స్ఫూర్తితో మరిన్ని కళాఖండాలను రూపొందిస్తానని అమర్ తెలిపాడు.
ఇదీ చదవండి: దేశంలో అమాంతం పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 2.47 లక్షల మందికి వైరస్