కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని చాలామంది రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. విరాళాలను పారదర్శకంగా సేకరించాలని డిమాండ్ చేశారు. 'రామ మందిర నిధి సమర్పణ్ అభియాన్'పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
నాజీతో పోలిక..
మందిర నిర్మాణానికి విరాళాలివ్వని ఇళ్లకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుర్తులు పెడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. వారిని నాజీలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. మందిర నిర్మాణానికి అనధికార వ్యక్తులు విరాళాలు వసూలు చేయడమేంటని కుమారస్వామి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు 'నాజీ' విధానాలను పోలి ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
''మందిర నిర్మాణానికి డబ్బులివ్వాల్సిందిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నన్ను బెదిరించారు. అసలు విరాళాలిచ్చిన వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించాల్సిన అవసరం ఏముంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తల నుంచి నాకు విమర్శలు ఎదురు కావచ్చు. అయినా వాటిని పట్టించుకోను.''
-కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
కేరళలో పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని కుమారస్వామి ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిపై ఉగ్రవాదుల ముద్ర వేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: పుల్వామాలో ముగ్గురు ఉగ్ర అనుచరుల అరెస్ట్