Ramayan Mahabharat in NCERT : పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ ముఖ్యమైన సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సూచించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ చరిత్రలోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించింది.
"ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలో ఉన్న చరిత్ర 'ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు'గా ఉంది. అయితే, మన చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని ప్యానెల్ కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. క్లాసిక్ పీరియడ్ (సంప్రదాయ చరిత్ర), మధ్య యుగం చరిత్ర, బ్రిటిష్ కాలం, ఆధునిక భారతదేశ చరిత్ర.. ఇలా నాలుగు భాగాలుగా వర్గీకరించి చరిత్రను బోధించాలి. క్లాసిక్ పీరియడ్‌లో ని పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలి. రాముడంటే ఎవరు? ఆయన ఉద్దేశాలు ఏమి? అనేది విద్యార్థులు తెలుసుకోవాలి. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల గురించి విద్యార్థులు కొంతవరకైనా తెలుసుకోగలగాలి"
--సీఐ ఐజాక్, కమిటీ ఛైర్మన్
'ఇండియాకు బదులు భారత్ వాడాలి'
చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలన మొదలైన విషయాలకు మరింత ఎక్కువగా స్థానం కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి పాఠాలను చేర్చాలని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాయాలని ప్రతిపాదించింది. పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు బదులు ‘భారత్’ అని ఉపయోగించాలని ఇటీవల ఈ కమిటీ సిఫార్సులు చేసింది.
స్పందించిన ఎన్‌సీఈఆర్‌టీ
ఇదిలా ఉండగా.. చరిత్ర పాఠ్యాంశాల్లో కమిటీ సిఫార్సుల గురించి మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. ‘‘పాఠ్యపుస్తకాల్లో నూతన సిలబస్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వివరాలు ఇప్పుడే వెల్లడించలేమంది. ప్యానెల్ సిఫార్సులకు ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు.
టెన్త్ క్లాస్ బుక్‌లో 'పిరియాడిక్ టేబుల్', 'ప్రజాస్వామ్యం' పాఠాలు మాయం.. NCERT కీలక నిర్ణయం
India Name Change In Text Books : 'ఇకపై టెక్స్ట్ బుక్స్‌లో 'ఇండియా' బదులు భారత్!'