అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రణాళికపై చర్చించేందుకు నిపుణులతో రెండు రోజుల సమావేశం నిర్వహిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. సోమవారం జరిగిన మొదటి రోజు సమావేశంలో ఆలయ పునాదుల నిర్మాణంపై చర్చించారు. ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశానికి రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించారు. రామమందిర నిర్మాణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
పునాది నిర్మాణ ప్రణాళికను ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు ఆలయ నిర్మాణ కమిటీలోని కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. సమావేశంలో భాగంగా ఆలయాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని నిపుణులు పరిశీలించినట్లు పేర్కొన్నారు.
రామాలయం నిర్మిస్తున్న భూభాగ ఉపరితలం అడుగులో ఇసుక ఉండటంపై అనిల్ మిశ్రా స్పందించారు. అది తమకు ఆశ్చర్యమేమీ కల్గించలేదని చెప్పారు. నదీతీర ప్రాంతంలో ఆలయాన్ని నిర్మిస్తున్నందన ఇలాంటివి సహజమేనని, దీనివల్ల ప్రాజెక్టుకు ఎలాంటి అవరోధాలు ఏర్పడవని స్పష్టం చేశారు.
" రామ మందిరాన్ని నిర్మిస్తున్న ప్రదేశం అడుగులో ఇసుక ఉందని ఎలాంటి భయాందోళన అవసరం లేదు. ఆగ్రాలో యమునా నది ఒడ్డున చారిత్రక తాజ్‌మహల్‌ను నిర్మించారు. ఇన్నేళ్లయినా ఇంకా చెక్కుచెదర కుండా ఉంది. తాజ్‌మహల్ భూఉపరితల అడుగులో కూడా ఇసుక ఉంది. ఇసుక వల్ల నిర్మాణంపై ఎలాంటి ప్రభావం ఉండదు. రామాలయ పునాదులను కనీసం 1000 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా దృఢంగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆలయ పునాదులు నిర్మించే నేలను ఐఐటీ మద్రాస్ పరీక్షిస్తోంది. గుడి కోసం వివిధ ఆకృతుల్లో చెక్కిన రాళ్లను కరసేవక్‌పురం నుంచి ఆలయ ప్రాంగణానికి ట్రస్టు తరలిస్తోంది. "
-అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు.
ఇదీ చూడండి: రాళ్లు పలికించే సుమధుర రాగాలివి!