గాజీపుర్ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతుల సంఖ్య తగ్గలేదని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ తెలిపారు. సరిహద్దులో భారీ సంఖ్యలో అన్నదాతలు ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గుడారాలలో రైతులు సౌకర్యంగానే ఉన్నారని వెల్లడించారు.
చలికాలాన్ని సమర్థంగా ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపిన అన్నదాతలు ఇప్పుడు వేసవి కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పారు టికాయిత్. రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
"వేసవి కాలం రావడానికి ముందే గాజీపుర్ సరిహద్దులో రైతుల కోసం ఏర్పాట్లు చేస్తాం. కూలర్లను సమకూర్చుతున్నాం. ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది. లేదంటే జనరేటర్లను ఉపయోగిస్తాం. తమ ఇళ్ల నుంచి నీటిని తీసుకొచ్చుకున్నట్లే.. రైతులు గ్రామాల నుంచి డీజిల్‌ను తీసుకొస్తారు."
-రాకేశ్ టికాయిత్, బీకేయూ జాతీయ ప్రతినిధి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో టికాయిత్ మహా పంచాయత్‌లను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందా అని అడగ్గా.. వాటితో తమకు సంబంధం లేదని అన్నారు. ఎన్నికలపై మహాపంచాయత్‌ల ప్రభావం గురించి తమకు సమాచారం లేదని చెప్పారు. సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని మాత్రమే ఉద్యమం చేస్తున్నామని స్పష్టం చేశారు టికాయిత్. సింహాసనాలు కావాలని ప్రభుత్వాన్ని కోరడం లేదని అన్నారు. కేంద్రం త్వరలోనే తమను చర్చలకు ఆహ్వానిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనీయం: టికాయిత్