Rakesh Tikait news today: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని బీకేయూ(భారతీయ కిసాన్ యూనియన్) నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని ట్వీట్ చేశారు.
సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల తర్వాత టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"ప్రధాని మోదీ మాకు క్షమాపణలు చెప్పాలని మేము కోరుకోవడం లేదు. విదేశాల్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతలను తగ్గించాలని మాకు లేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. రైతులను అడగాలన్నదే మేము కోరుకునేది. ఎంతో నిజాయితీగా పొలాల్లో ఆహారాన్ని పండిస్తాం. అలాంటిది.. మా డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు."
-- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత.
2020 మధ్యలో.. కేంద్రం మూడు సాగు చట్టాలను తీసుకొచ్చింది. ఇవి రైతులకు మేలు చేస్తాయని కేంద్రం ప్రచారం చేసింది. అయితే ఈ సాగు చట్టాలతో నష్టం తప్ప లాభాలు ఉండవని రైతు సంఘాలు ఉద్యమించాయి. విపక్షాలు మద్దతిచ్చాయి. ఏడాది పాటు నిర్విరామంగా ఈ నిరసనలు జరిగాయి. చివరికి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు, రైతులు ఇళ్లకు వెళ్లాలని గత నెలలో మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రైతులు నిరసనలు నిలిపివేసి ఇళ్లకు చేరారు.
అయితే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఇటీవలే చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 'మేము సాగు చట్టాలను తీసుకొచ్చాము. కొందరికి నచ్చలేదు. అందువల్ల మేము అసంతృప్తిలో ఉన్నట్టు కాదు. ఒక అడుగు వెనక్కి వేశాం.. భవిష్యత్తులో మళ్లీ వస్తాము,' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేంద్రం మళ్లీ చట్టాలను తీసుకొస్తుందని ప్రచారం జరిగింది. విపక్షాలు మండిపడ్డాయి. అనంతరం తోమర్ తన వ్యాఖ్యలపై స్పందించారు. సాగు చట్టాలను తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- Rakesh tikait: అఖిలేశ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన టికాయిత్!