చమురు ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాలు రెండో రోజు కూడా ఆందోళన చేపట్టాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. విపక్ష సభ్యుల ప్రసంగాలను ప్రసార మాధ్యమాల్లో ఎందుకు సరిగా ప్రసారం చేయడం లేదని కాంగ్రెస్ పక్ష నేత అధీర్‌రంజన్ చౌదరి నిలదీశారు. దీనికి సమాధానమిచ్చిన స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. విపక్షాలు చేసే గొడవలను ఎలా ప్రసారం చేస్తామని ఎదురు ప్రశ్నించారు. అనంతరం చమురు ధరలపై విపక్షాలు ఆందోళనకు దిగగా లోక్‌సభ తొలుత 12 గంటల వరకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు రైతు చట్టాలు, చమురు ధరలపై ఆందోళన కొనసాగించాయి. దీంతో ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి సభను 2గంటల వరకు వాయిదా వేశారు. అనంతర సభ మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో సభ బుధవారానికి వాయిదా పడింది.
రాజ్యసభలోనూ చమురు ధరలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ 12గంటల వరకు ఒకసారి, 2 గంటల వరకు మరో సారి వాయిదా పడింది. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు పట్టు విడవలేదు. దీంతో సభ బుధవారానికి వాయిదా పడింది.