Rajnath Singh On China: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చైనాకు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదిగిందన్నారు.
భారత్, అమెరికా మధ్య 2+2 చర్చల కోసం రాజ్‌నాథ్ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చైనా సరిహద్దుల్లో భారత సైనికుల శౌర్యపరాక్రమాలు, లద్దాఖ్ ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. "భారత సైనికులు ఏం చేశారో(గల్వాన్ ఘర్షణలను ఉద్దేశిస్తూ).. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో నేను బహిరంగంగా చెప్పలేను. అయితే భారత్‌కు హాని కలిగిస్తే.. ఎవర్నీ విడిచిపెట్టబోమన్న స్పష్టమైన సందేశం మాత్రం వారికి (చైనాను ఉద్దేశిస్తూ) వెళ్లిందని కచ్చితంగా చెప్పగలను" అని రాజ్‌నాథ్ అన్నారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి పట్ల అమెరికా చేస్తున్న విమర్శలపై కూడా రాజ్‌నాథ్ పరోక్షంగా స్పందించారు. "భారత్ ఒక దేశంతో సత్సంబంధాలు కలిగి ఉందంటే.. దాని అర్థం మరో దేశంతో మన సంబంధాలు క్షీణిస్తున్నాయని కాదు. ఇలాంటి దౌత్య విధానాన్ని భారత్ ఎప్పుడూ అవలంబించదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 'విన్-విన్' సూత్రాలపై అధారపడి ఉండాలని భారత్ విశ్వసిస్తుంది" అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: సర్పంచ్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు