RAJNATH SINGH AGNIPATH: త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు కేంద్రం చక్కని అవకాశం కల్పించింది. సాయుధ బాలగాల నియామక ప్రక్రియలో నూతన విధానం తీసుకొచ్చింది. నాలుగేళ్ల కాలపరిమితితో సైన్యంలో పనిచేసేలా 'అగ్నిపథ్' పేరుతో సర్వీసును ప్రారంభించింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఆమోదం తర్వాత కీలక విధానంపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన 'అగ్నివీరుల'కు మంచి వేతనం లభిస్తుందని రాజ్నాథ్ పేర్కొన్నారు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్యాకేజ్ సైతం అందుతుందని చెప్పారు.
25శాతం మందికి 'శాశ్వత' ఛాన్స్
భవిష్యత్ కాల సైనికులలో అగ్నివీరులు భాగమవుతారని మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో వీరిని సిద్ధం చేస్తామని చెప్పారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత 25 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన సర్వీసులోకి తీసుకుంటామని వివరించారు.
"అగ్నివీరులకు సర్వీసులో స్వల్ప, దీర్ఘకాల అవకాశాలు కల్పిస్తున్నాం. అగ్నివీరులు భారతదేశ యువ రక్షకులుగా నిలుస్తారు. నాలుగేళ్లు సేవలు అందించిన తర్వాత అగ్నివీరుల నేపథ్యం ప్రత్యేకంగా మారుతుంది. వీరు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తారు. సాయుధ దళాలను అధునికీకరించి, అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం యువతను ఇందులో భాగం చేసుకోవాలి. 17.5ఏళ్ల నుంచి 21ఏళ్ల వయసు ఉన్నవారిలో ఉత్తమమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాం. నాలుగేళ్ల పాటు సైన్యంలో వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన పనిచేసేందుకు వీరు స్వచ్ఛందంగా దరఖాస్తులు పంపే అవకాశం కల్పిస్తాం. మెరిట్, సంస్థాగత అవసరాలను బట్టి.. ఒక్కో బ్యాచ్లో 25 శాతం వరకు సభ్యులను శాశ్వతంగా సర్వీసులో చేర్చుకుంటాం."
-లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ
ఏవియేషన్, నాన్ ఏవియేషన్ విభాగాల్లో అగ్నివీరులకు శిక్షణ ఇస్తామని వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. వేగంగా మారుతున్న సాంకేతికతకు త్వరగా అలవాటు పడే యువత సామర్థ్యాన్ని తాము వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయుధాలు, అధునాతన వ్యవస్థల గురించి వాయుసేనలో వారు తెలుసుకుంటారని వివరించారు. ఆశావాహులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
AGNIPATH scheme details: అధికారులు, సైనికుల విభాగాల్లో అగ్నిపథ్ సర్వీసును ప్రారంభించాలని మూడేళ్ల క్రితమే ఆర్మీ వర్గాలు భావించాయి. అయితే, రెండేళ్లుగా కరోనా కారణంగా ఇవేవీ అమలుకు నోచలేదు. తాజాగా సైనికుల విభాగం వరకు అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా ఆర్మీలో వేతనాలు, పింఛన్ల భారం తగ్గించవచ్చని భావిస్తోంది. మిగులు నిధులతో ఆర్మీ ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది. తక్కువ కాలపరిమితి(షార్ట్) సర్వీసు కమిషన్ కింద యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35-36 ఏళ్ల నుంచి 25-26 ఏళ్లకు తగ్గనుంది.
ఇదీ చదవండి: