రాజస్థాన్ బాడ్మేర్‌లోని పనోరియా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌కు గజేదాన్ చరణ్‌కు ఆదాయ పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. రూ.32.63 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినందుకు గాను.. రూ.4.89 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది.
ఈ అంశంపై చరణ్‌ను 'ఈటీవీ భారత్' ప్రశ్నించగా.. తన ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి ఎవరో ఒక సంస్థను నమోదు చేశారని వాపోయాడు. ఆ సంస్థ దిల్లీలో నడుస్తోందని తెలిపాడు. ఊరిలో ఆటో నడుపుతూ నెలకు రూ.10,000 సంపాదించే తనకు ఈ లావాదేవీల గురించి సమాచారం లేదని చెప్పాడు.
నేను ఒక ఆటో డ్రైవర్‌ను. అతి కష్టంమీద నేను నెలకు రూ.10,000 సంపాదిస్తాను. రూ.5 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించడం నాకు సాధ్యమేనా? ఈ మోసానికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాను. వారే ఈ అంశంపై దర్యాప్తు చేస్తారు. మోసగాళ్లతో పన్ను చెల్లించేలా చేస్తారు.
-గజేదాన్ చరణ్, బాధిత ఆటో డ్రైవర్
అయితే ఆటో డ్రైవర్ అయిన తనను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని చరణ్ తెలిపాడు. కనీసం 10-12సార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాతే కేసు నమోదు చేశారని వివరించాడు.
బాడ్మేర్ ఎస్‌ఎస్పీ నార్పత్ సింగ్‌ను సంప్రదించగా.. దర్యాప్తు ప్రక్రియ కారణంగానే కేసు నమోదులో జాప్యం జరిగిందని వివరించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సినీ ప్రముఖులపై ఐటీ దాడులు- కిసాన్ మోర్చా ఆగ్రహం