Rajasthan Political Crisis : రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. సీఎల్పీ సమావేశానికి ముందు సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులు స్పీకర్ సీపీ జోషిని కలిసి తమ రాజీనామా పత్రాన్ని అందజేసేందుకు ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మెుత్తం 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లినట్లు సమాచారం.
రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాల మధ్య ఎప్పట్నుంచో విభేదాలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామాలతో మరోసారి అక్కడి రాజకీయాలు వేడెక్కాయి.
2020లో సచిన్ పైలట్ తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు సీఎం కావాలని అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు, ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో నామినేషన్ వేసే నాటికి గహ్లోత్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆ పార్టీ తీసుకున్న ఒక్కరికి ఒకే పదవి విధానం ఆధారంగా ఆయన సీఎం పదవి నుంచి దిగిపోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు, ఎమ్మెల్యేల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని స్వతంత్ర ఎమ్మెల్యే సన్యం లోధా అన్నారు. గహ్లోత్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మరో నేత గోవింద్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. అశోక్ గహ్లోత్ సీఎంగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేయగలరన్నారు. గహ్లోత్‌ని సీఎంగా కొనసాగించకపోతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడంలో పార్టీ పెద్ద సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: 137 ఏళ్లలో మూడు సార్లే అధ్యక్ష ఎన్నికలు.. ఈసారి సరికొత్త లెక్క.. పార్టీ పరిస్థితి మారేనా?
రిసార్ట్ కూల్చివేత, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై డౌట్స్.. రిసెప్షనిస్ట్ కేసులో మరో ట్విస్ట్!