ఇక్కడ వరుసగా నిల్చుని బ్యాండ్ వాయిస్తున్న వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. క్షణికావేశంలో తప్పులు చేసి జైలు శిక్ష అనుభవించిన వారికి.. సమాజం నేరస్థులుగా ముద్ర వేస్తుంది. దీంతో వారు సరైన జీవనోపాధి లేకుండా బతుకుతుంటారు. ఇలా కాకుండా వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో.. వారికి బ్యాండ్, పెట్రోల్ బంకుల నిర్వహణలో శిక్షణ ఇస్తోంది జైళ్ల శాఖ.
రాజస్థాన్‌లోని కోటా సెంట్రల్ జైలులో ఎంతో మంది ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తుంటారు. వీరందరి కోసం పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తోంది జైళ్ల శాఖ. ఇప్పుడు దీనికి అదనంగా బ్యాండ్ శిక్షణ సైతం అందిస్తోంది. వీటి ద్వారా అనేక మంది ఖైదీలకు జీవనోపాధిని చూపిస్తోంది. వీరంతా జైలు ఆవరణలోని పెట్రోల్ బంకులో పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
అక్రమ్, రమేశ్.. ఓ కేసులో శిక్ష పడడానికి ముందు బ్యాండ్ వాయించేవారు. ఇప్పుడు జైలులో తోటి ఖైదీలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ బృందంలో 21 మంది ఖైదీలు ఉన్నారు. మరో రెండు నెలల శిక్షణ అనంతరం వీరిని వేడుకల్లో వాయించడానికి పంపిస్తామని జైలు అధికారులు చెప్పారు.
"పెట్రోల్ బంక్‌కు మంచి స్పందన వస్తోంది. జనవరి 1న ఐఓసీఎల్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించాం. మొదటి రోజు రూ.72,000 అమ్మకాలు జరిగాయి. రెండో రూ.2 లక్షలు, మూడో రోజు రూ.3 లక్షలు వచ్చాయి. బ్యాండ్ సామగ్రి కూడా కొని శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తయ్యాక డ్రెస్సులు కొని వివిధ కార్యక్రమాలకు పంపిస్తాం."
--పీఎస్ సిద్ధు, జైలు అధికారి
"నేను జూన్ 2015 నుంచి జైలులో ఖైదీగా ఉంటున్నా. నాకు 12 ఏళ్లు శిక్ష పడింది. జైలులో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలోనే పెట్రోల్ బంక్ తెరవడం వల్ల ఇక్కడే పని చేస్తున్నాను. లోపల కన్నా బయటే బాగుంది."
--సునీల్ పంచాల్, ఖైదీ
ఇవీ చదవండి: పంచ కట్టులో అర్చకుల క్రికెట్.. సంస్కృత భాషలో కామెంటరీ
గుడిలో మహిళపై ధర్మకర్త దాడి.. జట్టు పట్టుకుని గెంటివేత.. నల్లగా, వింతగా ఉన్నావంటూ..