Ashok Gehlot Congress President: శతాధిక పార్టీ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ పదవి చేపట్టనున్నట్లు.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, దీనిపై గహ్లోత్ స్పందించారు.
'మీడియా ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. వివరాలేమీ తెలియదు. నాకు కేటాయించిన విధుల్ని నేను నిర్వర్తిస్తున్నాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుతం నేను ఆ రాష్ట్ర పరిశీలకుడిగా ఉన్నాను. రాజస్థాన్‌లో నా బాధ్యతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. మిగిలిన విషయాలు అన్నీ మీడియా నుంచే వింటున్నాను' అంటూ ఆ వార్తలను తోసిపుచ్చారు.
ఇటీవల సోనియా.. గహ్లోత్‌తో సమావేశమై, అధ్యక్ష పదవి చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ పదవికి ఈయన పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఎలాంటి ధ్రువీకరణ మాత్రం లేదు. ఈ సీనియర్ నేత గాంధీల కుటుంబానికి విశ్వాసపాత్రుడు. అలాగే ఆయనకున్న రాజకీయ అనుభవం ఈ ఎంపికలో కీలకం కానుందనే అభిప్రాయం ఉంది.
మరోవైపు.. గాంధీయేతరులు పార్టీ బాధ్యతలు తీసుకుంటే, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవిని చేపడితే ఉండే కష్టనష్టాల గురించి ఆయనకు బాగా తెలుసునని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అలాగే రాజస్థాన్‌లో అధికారాన్ని వదులుకొని, దానిని మరో కీలక నేత సచిన్ పైలట్‌కు అందించేందుకు ఈయన ఏమాత్రం సుముఖంగా లేరని పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ పదవికి అంతా రాహుల్ గాంధీ పేరునే ఏకగ్రీవంగా ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట గహ్లోత్ కూడా దీనిపై మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాహుల్ నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. కానీ ఆయన మాత్రం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకురావడం లేదని వార్తలు వచ్చాయి. వచ్చే నెల సెప్టెంబర్ 20 లోగా పార్టీ సారథి ఎన్నిక పూర్తవుతుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి సారథ్య పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. అనారోగ్య కారణాల రీత్యా ఆమె ఈ బాధ్యతలను కొనసాగించేందుకు సిద్ధంగా లేరని పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ వాద్రా పేరు కూడా తెరపైకి వస్తోంది. గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని కాంగ్రెస్‌లో అత్యధికులు భావిస్తున్నారు. దీంతో రాహుల్ ఒప్పుకోకపోతే ఆమె పేరును ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక వైఫల్యాల దృష్ట్యా ఆమెకు పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోవచ్చని సమాచారం. దీంతో పార్టీ తదుపరి అధ్యక్షులు ఎవరనే దానిపై సందిగ్ధత వీడట్లేదు. అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారుచేసేందుకు పార్టీ నిర్ణయాత్మక విభాగం(సీడబ్ల్యూసీ) ఆదివారం భేటీ కానుంది.
ఇవీ చూడండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సన్నాహాలు, త్వరలో షెడ్యూల్
దేశాన్ని ఏకం చేసేందుకు రాహల్ పాదయాత్ర, 5 నెలల్లో 3500 కిలోమీటర్లు